AP JAC Amaravati plans protests: ఓవైపు చర్చలు మరోవైపు సంప్రదింపులు, రాయబారాలు ఇలా శతవిధాలుగా ప్రయత్నించిన తరువాత వారంతా... ఓ నిర్ణయానికి వచ్చారు. ఇక ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని నిర్ణయించుకున్న ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు.. చివరకు కార్యచరణ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగుల కార్యచరణపై తిరుపతిలోని ఆఫీసర్స్ క్లబ్ లో ఏపీ జేఏసీ అమరావతి సహ అధ్యక్షుడు ఫణి పేర్రాజు సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలో ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిందని ఏపీ జేఏసీ అమరావతి సహ అధ్యక్షుడు ఫణి పేర్రాజు అన్నారు. ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించిన కార్యాచరణపై తిరుపతిలోని ఆఫీసర్స్ క్లబ్లో సమీక్ష నిర్వహించామని ఆయన తెలిపారు. సీఎం జగన్ ఎన్నికలకు ముందు ఉద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చారని... అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు.
ఉద్యోగులు దాచుకున్న డబ్బులను ప్రభుత్వం వినియోగించడమేంటని ఆయన ప్రశ్నించారు. పదవీ విరమణ ప్రయోజనాలు సకాలంలో అందకపొవడంతో ఉద్యోగులు పదవీ విరమణ చేయడానికి భయపడాల్సిన పరిస్ధితి నెలకొందన్నారు. స్వచ్చంధ పదవీ విరమణ అంటేనే భయపడే పరిస్థితికి ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. హక్కులను పరిరక్షించుకోవడానికి ఉద్యోగులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఉద్యోగస్తులందరు ఒకే తాటిపై ఉన్నామని ఆయన తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కోరారు.