రాష్ట్రంలోని ఆలయాలపై మొదటి దాడి జరిగినప్పుడే ముఖ్యమంత్రి జగన్ స్పందించి ఉంటే విగ్రహాల ధ్వంసం ఘటనలు జరిగి ఉండేవి కాదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. 142 ఆలయాలపై దాడులు జరిగే వరకు ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని నిలదీశారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా పలాసలోని సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహం వద్ద తెదేపా ఆధ్వర్యంలో నిరసన జరిగింది. డిసెంబర్ నెలలో గౌతు లచ్చన్నపై మంత్రి సీదిరి అప్పలరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ తెదేపా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. కార్యక్రమంలో జిల్లా పార్టీ ముఖ్య నేతలందరూ పాల్గొన్నారు. అనంతరం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. 142 ఆలయాలపై దాడులు జరిగే వరకూ ప్రభుత్వం కనీసం స్పందించలేదు. ఇప్పుడు ప్రజల ఆగ్రహావేశాలను చల్లార్చేందుకు శంకుస్థాపనలు, కమిటీలు అంటూ ప్రభుత్వం మాటలు చెబుతోంది. విజయవాడలో 8 దేవాలయాలకు సీఎం ఇవాళ శంకుస్థాపన చేశారు. 19 నెలలు నిద్రపోయారా?. ఇన్నాళ్లు ఆలయాల పరిరక్షణ ఎందుకు గుర్తుకురాలేదు- అచ్చెన్నాయుడు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు