శ్రీకాకుళం జిల్లాలో బదిలీలకు దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులకు కంటిమీద కునుకు ఉండటం లేదు. తప్పనిసరి బదిలీల్లో ఉన్నవారి పరిస్థితి మరింత దారుణంగా మారింది. వారికి కొత్త స్థానం కేటాయింపు ఎక్కడ ఉంటుందో తెలియక సతమతమవుతున్నారు. వెబ్ కౌన్సెలింగ్‌కు ప్రభుత్వం సిద్ధపడటమే ఇందుకు కారణం. గతంలో ప్రత్యక్ష కౌన్సెలింగ్‌లో ఖాళీలను బహిర్గతం చేసి చూపేవారు. దీనికి అనుగుణంగానే ఉపాధ్యాయులు నచ్చిన స్థానాన్ని కోరుకొనేవారు. కానీ వెబ్ కౌన్సెలింగ్‌లో ఇలా కుదరదు. ఆప్షన్లు పెట్టుకొవటమే ఉపాధ్యాయుల పని... కేటాయింపు ఉన్నతాధికారులపై ఆధారపడి ఉంటుంది.
బదిలీల ప్రక్రియలో సందిగ్ధత తలెత్తుతున్న నేపథ్యంలో షెడ్యూలు ప్రకారం పూర్తవుతుందా..? అన్న అనుమానాలు తలెత్తున్నాయి. జాబితా ప్రకటన ఈనెల 8 నుంచి 10 మధ్య పూర్తి చేయాలి. వెను వెంటనే వెబ్ ఆప్షన్ల నమోదు ఈనెల 11 నుంచి 25 తేదీల మధ్య చేపట్టాలి. బదిలీల ఆర్డర్‌లు ప్రదర్శన 16 నుంచి 21 తేదీల మధ్య ఉంటుంది. సాంకేతిక సమస్యలపై 22, 23 తేదీల్లో అభ్యంతరాలను స్వీకరిస్తారు. అనంతరం 24న బదిలీల ఆర్డర్లు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
అధికారుల నిర్లక్ష్యం కారణంగా చాలా మంది ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఉపాధ్యాయు పోస్టుల కుదింపు జరుగుతోంది. దీన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. ఖాళీలను బ్లాక్ చేయటం దుర్మార్గమైన విషయం. ప్రభుత్వం స్పందించి పోస్టుల కుదింపును తగ్గించాలి.
- గిరిధర్, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి.