శ్రీకాకుళం జిల్లాలో తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జరుగుతోంది. నేటితో నామినేషన్ల గడువు పూర్తవుతుంది. ఆ తర్వాత నామినేషన్లు వేసినవారు ఉపసంహరించుకోవడానికి, ఓటర్లను ప్రలోభ పెట్టడానికి మద్యం, డబ్బును ఎరగా ఉపయోగించాలని బడా నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. తద్వారా తాము ఎంపిక చేసిన వ్యక్తే చివరికి బరిలో నిలుస్తారని కుయుక్తులు పన్నుతున్నారు. ఈ క్రమంలో భారీఎత్తున అక్రమ మద్యం, నాటుసారా జిల్లాలోకి ప్రవేశించే అవకాశాలున్నాయని పోలీసు వర్గాలు ముందస్తుగానే అంచనా వేశాయి. ఈ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి సరిహద్దు మండలాలైన ఇచ్ఛాపురం, మందస, కొత్తూరు, మెళియాపుట్టి, పాతపట్నం, తదితర ప్రాంతాల్లో చెక్‌పోస్టులను మరింత బలోపేతం చేశారు. జిల్లాలోకి ప్రవేశించే ప్రతి వాహనాన్నీ క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఏమీ లేవని నిర్ధారించుకున్న తర్వాతే వాహనాన్ని వదులుతున్నారు.
పొరుగు రాష్ట్రం నుంచి....
లాక్‌డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయిన కొందరు సులువుగా డబ్బు సంపాదించడానికి మద్యం అక్రమ రవాణాయే పనిగా పెట్టుకున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమని తెలిసినా వారు మానడం లేదు. ఇక్కడి మద్యం ధరలు పొరుగు రాష్ట్రంతో పోలిస్తే కొంత ఎక్కువే. అందుకే బరిలో నిలిచే అభ్యర్థులు కూడా పొరుగు రాష్ట్రం నుంచి పెద్దఎత్తున మద్యం అక్రమ రవాణా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆ మద్యాన్నే ఎరగా చూపి ఓటర్లను తమవైపునకు తిప్పుకోవాలనేదే అభ్యర్థుల లక్ష్యం. సాధారణ రోజుల్లోనే వందల మంది యువకులు, వ్యాపారస్తులు మద్యం అక్రమ రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడేవారు. ఇప్పుడు అలాంటి వారంతా మళ్లీ తెరపైకి వచ్చే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు వారి కదలికలపైనా నిఘా ఉంచినట్లు తెలుస్తోంది.
ఆధారాలు చూపకపోతే అదుపులోకే...