బాబాయ్... అబ్బాయ్... అమ్మాయి...
శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు జగన్ ప్రభంజనం సృష్టించారు. వైకాపా సునామీలో ఎందరో హెమాహేమీల అడ్రస్ గల్లంతైంది. దివంగత నేత కింజారపు ఎర్రన్నాయుడు కుటుంబం మాత్రం ఫ్యాను హవా తట్టుకొని నిలబడింది. రాష్ట్రవ్యాప్తంగా తెదేపాకు ఎదురుగాలి వీచినా... శ్రీకాకుళం పార్లమెంటు, టెక్కలి అసెంబ్లీ, రాజమహేంద్రవరం పట్టణ అసెంబ్లీ స్థానాల్లో ఎర్రన్నాయుడి కుటుంబీకులు ఫ్యాను స్పీడుకు బ్రేకులు వేశారు.
రాష్ట్రంలో ఫ్యాన్ గాలి ప్రభంజనంలా వీచింది. శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో జగన్ సారథ్యంలోని వైకాపా అసాధారణ విజయం సొంతం చేసుకుంది. ఏకంగా 150కిపైగా అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని తిరుగులేని ఆధిక్యంతో అధికారాన్ని కైవసం చేసుకుంది. వైకాపా ప్రభంజనంలో దశాబ్దాల అనుభవం ఉన్న నేతలు పరాజయం పొందారు. ఎందరో ప్రముఖులు ఆధిక్యం... అనే మాట వినలేదు. కానీ దివంగత నేత కింజారపు ఎర్రన్నాయుడి కుటుంబ సభ్యులు మాత్రం ఫ్యాను గాలికి ఎదురొడ్డి నిలిచారు.
శ్రీకాకుళం పార్లమెంటు స్థానంలో ఎర్రన్నాయుడి తనయుడు రామ్మోహన్ నాయుడు తెదేపా తరఫున పోటీచేశారు. హోరాహోరి పోరులో విజయం సాధించారు. ఇక ఎర్రన్నాయుడి సోదరుడు అచ్చెన్నాయుడు టెక్కలి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. ఉత్కంఠ పోరులో వైకాపా జోరుకు అడ్డుకట్ట వేసి విజయం సాధించారు. తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా జగన్ సునామీ సృష్టించగా... రాజమహేంద్రవరం పట్టణ అసెంబ్లీ స్థానం నుంచి తెదేపా తరఫున పోటీచేసిన ఎర్రన్నాయుడి కుమార్తె, రామ్మోహన్నాయుడు సోదరి ఆదిరెడ్డి భవాని 30వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తెదేపాలో కీలక నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, కేంద్ర మాజీ మంత్రులు పరాజయం పొందినా ఎర్రన్నాయుడి కుటుంబ సభ్యులు గెలుపొందడంపై పార్టీ కార్యకర్తలు, కింజారపు అభిమానులు అనందం వ్యక్తం చేస్తున్నారు.