Sri Mukhalingeswara Temple: కాశీలో లింగం, గంగలో స్నానం, శ్రీముఖలింగం దర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. అంతటి ప్రసిద్ధ శైవ క్షేత్రాలలో శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం శ్రీముఖలింగంలో వెలసిన శ్రీముఖలింగేశ్వరస్వామి దేవాలయం ఒకటి. ఎంతో అపురూప శిల్ప సౌందర్యం గల ఈ ఆలయాన్ని అధికారులు పట్టించుకోవడంలేదంటూ అర్చకులు చెప్తున్నారు. ఎంతో గొప్ప చరిత్ర ఉన్న ఈ పుణ్యక్షేత్రాన్ని ఏటా కొన్ని లక్షల మంది దర్శించుకుంటున్నారు. శ్రీముఖలింగంలో శిల్ప సౌందర్యం పర్యాటకలను అబ్బురపరుస్తోంది. చెక్కపై చెక్కలేని చిత్రాలను సైతం రాతిపై అద్భుతంగా చిత్రించిన చిత్ర కళా సౌందర్యం శ్రీముఖలింగేశ్వర ఆలయ వైభవాన్ని తెలియజేస్తుంది.
ఏళ్లు గడుస్తున్నకొద్ది ఆలయ నిర్వహణ లోపం కారణంగా గోడలు పెచ్చులు ఊడుతున్నాయి. విగ్రహాల మొహం, చేతులు, కాళ్లకు పగుళ్లు ఏర్పడి కింద పడి గుర్తించలేని విధంగా తయారవుతునాయి. సుధూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి బస్సు షెల్టర్ , భోజన సదుపాయం, సత్రం, మరుగుదొడ్లు, స్నానపు గదులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని భక్తులు చెబుతున్నారు. ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు పురావస్తుశాఖ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఎంతో మంది యాత్రికులు వస్తున్నారు. ఉండటానికి కనీసం సత్రాలు కూడా లేవు.. ఎంతో మంది మినిస్టర్లు వస్తున్నారు.. పెద్ద పెద్ద నాయకులు వస్తున్నారు.. అందరి తోటీ మోము చెప్తున్నాం.. కాని వచ్చిన వాళ్లంతా అలాగే చేద్దాము.. చూద్దాము అంటున్నారు తప్ప చేసేవారు ఒక్కరూ కనిపించడం లేదు.అధికారులు ఎవరూ కూడా స్పందించడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందిచి చర్యలు తీసుకోవాలి.- సింహాచలం శర్మ, అర్చకులు శ్రీముఖ లింగేశ్వర ఆలయం