జిల్లాలో జిల్లా పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గాలకు పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ బుధవారం అర్ధరాత్రి దాటినా కొనసాగింది. నామినేషన్ల గడువు ముగిసే సమయం సాయంత్రం ఐదు గంటలకు దాదాపు 90 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అప్పటికింకా దాదాపు 170 మంది నుంచి నామినేషన్లు స్వీకరించాల్సి ఉంది. వారందరినీ ఒక గదిలో ఉంచి ఒక్కొక్కరి నుంచి నామినేషన్లను తీసుకున్నారు. ఆ తరువాత అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో అందరి వంతు పూర్తయింది. అధికార పార్టీ వైకాపా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ఎంపిక చేయలేదు. శాసనసభ్యులు, సమన్వయ కర్తలకు సంబంధించి బంధువర్గాలను ఎంపిక చేయొద్దని అధిష్టానం ఉదయమే ఆదేశాలు జారీ చేయడంతో ఆశావహులు నీరుగారిపోయారు. నామినేషన్ల ఘట్టం ముగిశాక అధిష్టానం ఆమోదం పొందొచ్చని నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన ప్రతి పక్షం తెదేపా అభ్యర్థుల ఖరారును పూర్తి చేసి శాసనసభ్యులు, సమన్వయ కర్తలకు బి.ఫారాలను అందించింది.
పోటాపోటీగా టిక్కెట్టు కోసం..
అధికార పార్టీలో ఇంకా టిక్కెట్లు ఖరారు కాకపోవడంతో ఆశావహులు నామినేషన్ల పర్వాన్ని కొనసాగించారు. నందిగాం జడ్పీటీసీ స్థానానికి పేరాడ భార్గవితో పాటు మడపాల లీలావతి, మాదిన శ్రీదేవమ్మ, చిన్ని పూర్ణావతి, బొమ్మాళి సుశీల, తమిరే గుణావతి పోటీ పడుతున్నారు. భార్గవికి కాకపోతే సుశీలకు అవకాశం ఉండొచ్చని చెబుతున్నారు. టెక్కలిలో దువ్వాడ వాణితో పాటు చింతాడ మంజు, జి.సుజాతలు టిక్కెట్టు రేసులో కొనసాగుతున్నారు. వీరఘట్టం స్థానానికి ముగ్గురు పోటీ పడుతున్నారు. దూసి జానకమ్మ, జంపు కన్నతల్లి, కళింగ సుష్మ ప్రియాంకలు రంగంలో ఉన్నారు. భామిని జడ్పీటీసీ స్థానానికి తింగ అన్నాజీరావు, బోదెపు శ్రీను, మద్ది మోహనరావుల మధ్య వైకాపాలో పోటీ కొనసాగుతోంది. లావేరు స్థానానికి గతంలో వైకాపా తరపున పోటీ చేసి ఓడిపోయిన గొర్లె అప్పలనాయుడు నామినేషన్ వేశారు. ఎచ్చెర్ల స్థానానికి జరుగుల్ల శంకరరావు, సనపల నారాయణరావు, బొడ్డేపల్లి సుధాకర్, బల్లాడ జనార్ధన్‌రెడ్డిలు పోటీ పడుతున్నారు. భామిని నుంచి మజ్జి సరస్వతి, బొడ్డేపల్లి చిన్నమ్మడు, బిడ్డిక నయోమి పోటీ పడుతున్నారు. సంతబొమ్మాళి వైకాపా అభ్యర్థిత్వానికి నలుగురుపోటీ పడుతున్నారు. కిల్లి జగన్నాధం, పాల వసంతరెడ్డి, కోత సతీశ్, ప్రధాన రాజేంద్రప్రసాద్ నాలుగురూ నామినేషన్లు వేశారు. ఇంత వరకు స్పష్టత లేదు. గురువారం నామినేషన్ల పరిశీలన చేస్తారు. సక్రమంగా లేనివాటిని తిరస్కరిస్తారు. బి.ఫారాలను అందించేందుకు మాత్రం ఈనెల 14 వరకు గడువు ఇచ్చారు.