ముఖ్యమంత్రి జగన్ నేడు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించనున్నారు. కాసేపట్లో తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరనున్న సీఎం.. 11 గంటలకు నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. అక్కడ బహిరంగసభలో ప్రసంగించనున్న సీఎం... లబ్ధిదారులకు రీసర్వే పత్రాలు పంపిణీ చేస్తారు. 2020 డిసెంబర్ 21న వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఇప్పటివరకు 47 వేల 276 చదరపు కిలోమీటర్ల పరిధిలోని.... 6 వేల 819 గ్రామాల్లో డ్రోన్ ఫ్లయింగ్ పూర్తిచేసింది.
2 వేల గ్రామాల్లో రీసర్వే కార్యకలాపాలు పూర్తవగా... 18 వందల 35 గ్రామాల్లో 7 లక్షల 29 వేల 381 మంది రైతుల భూహక్కు పత్రాలను తయారుచేశారు. వచ్చే 15 రోజుల్లో 2 వేల గ్రామాలకు సంబంధించిన రైతులకు భూహక్కు పత్రాలు పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ 2 వేల గ్రామాల రిజిస్ట్రేషన్ సేవలను గ్రామ సచివాలయాల్లో ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి జగన్ నేడు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో.. భూపత్రాల పంపిణీని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.