Drinking water problem started in Srikakulam: ఒడిశా నుంచి దిగువన ఉన్న ఆంధ్ర ప్రాంతంలోకి ప్రవహిస్తున్న మహేంద్రతనయ నదిపై ఒడిశా అధికారులు తాత్కాలిక అడ్డుకట్టలు ఏర్పాటు చేయడంపై.. సరిహద్దు ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒడిశా ప్రజల అవసరాల కోసం శ్రీకాకుళం జిల్లాలోని ఒడిశా సరిహద్దు ప్రాంతమైన పర్లాఖిముడి వద్ద ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేసి మహేంద్రతనయ నదీ జలాలను మళ్లిస్తున్నారు. దీంతో శ్రీకాకుళం జిల్లా ప్రజలకు నీటి కష్టాలు మొదలయ్యాయి. తాగు, సాగునీటికి ఆధారమైన మహేంద్రతనయలో అడ్డుకట్టలను తొలగించకుంటే రానున్న వేసవి కాలంలో తీవ్ర ఇబ్బందులు తప్పవని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఒడిశా భూభాగంలో పుట్టిన మహేంద్రతనయ నది శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వద్ద ఆంధ్రాలో ప్రవేశిస్తుంది. ఈ నది అటు ఒడిశాతో పాటు ఇటు పాతపట్నం నియోజకవర్గానికి ప్రధానమైన నీటి వనరుగా ఉంది. ఈ నదిపై ఆధారపడి 7 రక్షిత నీటి పథకాలు, 2 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. సుమారు 25 వేల మంది జనాభాకు ఈ నది తాగునీటి అవసరాలను తీరుస్తోంది. రబీ కాలంలో వందలాది ఎకరాల సాగుకు ఈ నదీ జలాలపైనే రైతులు ఆధారపడుతున్నారు. అయితే ప్రతి ఏడాది వేసవిలో నదిలో నీటి నిల్వలు తగ్గటం సర్వసాధారణం. కాని ఒడిశా అధికారులు మాత్రం వేసవి రాకముందే తమ ప్రాంత ప్రజల నీటి అవసరాల దృష్ట్యా నది ప్రవాహానికి అడ్డుగా ఇసుక కట్టలు వేసి నీటిని మళ్లిస్తున్నారు.