ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అప్పుడు కునుకుతీశారు.... ఇప్పుడు కూల్చేస్తున్నారు - demolish

శ్రీకాకుళం నగరంలో ప్రభుత్వ స్థలాలు పరాయి చేతుల్లోకి మారుతున్నాయి. కోట్ల రూపాయాలు విలువ చేసే స్థలాలు... దర్జాగా కజ్జాపాలవుతున్నాయి. చెరువును సైతం కబళించి లేఅవుట్లుగా మార్చేసి అమ్మేస్తున్నారు అక్రమార్కులు. ఇన్నాళ్లకు స్పందించిన నగరపాలక సంస్థ అధికారులు అనధికారిక లేఅవుట్లు ధ్వంసం చేస్తున్నారు.

అక్రమంగా నిర్మించిన ఓ భవనాన్ని కూల్చివేస్తున్న సిబ్బంది

By

Published : May 2, 2019, 3:59 PM IST

ఆక్రమణల పర్వం

శ్రీకాకుళం నగర పాలక సంస్థ పరిధిలో ఇళ్ల స్థలాలకు డిమాండ్‌ పెరిగి... భూ ధరలూ రెట్టింపు అయ్యాయి. అదే స్థాయిలో కబ్జాలు జోరుందుకున్నాయి. నాలుగైదేళ్లుగా ఆక్రమణలు చోటు చేసుకుంటున్నా... వీటిని నిలువరించాల్సిన అధికారులు మిన్నకుండిపోయారు. ఫిర్యాదులు వచ్చినా ముడుపులకు కక్కుర్తిపడి పట్టించుకోలేదు. ఇది ఆక్రమణదారులకు ఊతం ఇచ్చింది. కబ్జా స్థలాల్లో నిర్మించిన ఇళ్లకే ఇంటి పన్ను వేయడమేకాదు, మరుగుదొడ్లు, కుళాయిలు మంజూరు చేశారు. ఫిర్యాదులు ఎక్కువయ్యేసరికి నగరపాలక సంస్థ అధికారులు స్పందించక తప్పలేదు.

పెద్ద ఎత్తున భూ కబ్జాలు
నగరపాలక సంస్థ పరిధిలో 50 డివిజన్లు ఉన్నాయి. వాటిలో 54 రిజర్వు స్థలాలే లక్ష్యంగా అక్రమార్కులు పాగా వేశారు. దర్జాగా కట్టడాలు నిర్మించారు. కొన్నింటి రూపురేఖలే మార్చేశారు. ఇప్పుడు అలాంటి స్థలాల అసలు హద్దులు గుర్తించే పనిలో పడ్డారు. నగరపాలక సంస్థ అధికారులు. పూర్తిస్థాయిలో సర్వే చేపట్టారు. స్థలాల ఆక్రమణపై నగరపాలక సంస్థ అధికారులు సమగ్ర నివేదిక రూపొందిస్తున్నారు. ఈ స్థలాల్లో ప్రస్తుతం ఉన్న యజమానుల వివరాలు సేకరిస్తున్నారు. స్థలాలను మొదట ఎవరు అక్రమించుకున్నారు... ఎవరెవరు క్రయవిక్రయాలకు పాల్పడ్డారో గుర్తిస్తున్నారు. నగరంలో పెద్ద ఎత్తున భూకబ్జాకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఉదంతంపై సమగ్ర విచారణ చేపట్టాలని శ్రీకాకుళం ప్రజలు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details