శ్రీకాకుళం జిల్లా భావనపాడు ఓడరేవు నిర్మాణాన్ని ఆదానీ సంస్థకు గతంలో అప్పగించారు. సుమారు 2,250 ఎకరాలను సేకరించాల్సి ఉంది. పరిహారం, పునరావాస కార్యక్రమాలకు సుమారు రూ.1,200 కోట్లు ఖర్చవుతుందని తాజా అంచనా. పోర్టు నిర్మాణానికి డీపీఆర్ తయారీ సమయంలో రూ.500 కోట్లు సరిపోతుందని ప్రతిపాదించారు. భూసేకరణకు ఇంతకు మించి వెచ్చించడానికి ఆదానీ సంస్థ సంసిద్ధత తెలపడం లేదని తెలిసింది.
మచిలీపట్నం ఓడరేవు నిర్మాణానికి 2,895 ఎకరాలను గుర్తించారు. గతంలో నవయుగ సంస్థతో జరిగిన ఒప్పందాన్ని ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసింది. ప్రకాశం జిల్లా రామాయపట్నంలో ఓడరేవును సుమారు రెండు వేల ఎకరాల్లో చేపట్టనున్నారు. కేంద్రం నుంచి నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. దుగరాజపట్నం బదులు దీన్ని చేపట్టాలని ప్రతిపాదించింది.