ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భూముల విలువకు రెక్కలు... కబ్జా కోరల్లో ప్రభుత్వ ఆస్తులు - goverment lands

ప్రభుత్వ స్థలాలు పరాయి చేతుల్లోకి మారుతున్నాయి. కోట్ల రుపాయల విలువ చేసే స్థలాలను పాలకొండలో దర్జాగా కబ్జా చేస్తున్నారు. చెరువును సైతం కబ్జా చేసిన అక్రమార్కులు... లేఅవుట్లుగా మార్చి  క్రయవిక్రయాలు  సాగిస్తున్నారు. సర్కారీ స్థలాలను యథేచ్ఛగా ఆక్రమణలు చేస్తున్నా అధికార యంత్రాంగం ఉలుకూపలుకూ లేకుండా ఉంది.

దర్జాగా కబ్జా

By

Published : Jun 10, 2019, 10:02 AM IST

దర్జాగా కబ్జా

శ్రీకాకుళం జిల్లా పాలకొండలో భూమి విలువ అమాంతం పెరిగి.. సెంటు స్థలం విలువ పది లక్షల పైమాటే పలుకుతోంది. ఈ పరిస్థితులతో ప్రభుత్వ స్థలాలపై అక్రమార్కుల కన్ను పడింది. సాగునీటి చెరువులు.. తాగునీటి బందలు.. ప్రభుత్వ స్థలాలు... ఇలా కనిపించిన వాటిని కబ్జా చేసేస్తున్నారు. పాలకొండ పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయం ఎదురుగా సర్వే నెంబరు 287లో ఎకరా 9 సెంట్ల స్థలం డీసీఎంఎస్‌ స్థలం ఉంది. రహదారి సమీపంలో ఉండడం... భూముల ధరలు అధికంగా పలుకుతున్నందున కొందరు వ్యక్తులు ఈప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించేశారు. ప్రధాన రహదారిని ఆనుకుని సర్వే నెంబరు 285లో రాముడు కోనేరు ఉండేది. ఎకరా 49 సెంట్లు విస్తీర్ణంలో ఉన్న ఈ కోనేరు ప్రస్తుతం పూర్తిగా ఆక్రమణలకు గురైంది. పట్టణంలోని ప్రధాన రహదారిని ఆనుకుని నాగవంశం వీధి సమీపంలో పీతలవాని బంద ఎకరా 50 సెంట్లు ఉండేది. గతంలో తాగునీటి అవసరాలకు వినియోగించే ఈ బందను ... సమీపంలోని ప్రజలు సగానికిపైగా ఆక్రమించేశారు. బావిగట్టు వీధి శివారులోని నిరుపయోగంగా ఉన్న మరో చెరువును ... చుట్టుపక్కల వారు కొందరు కబ్జా చేసేశారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఇప్పటికే చెరువు గట్టును ఆక్రమించేశారు. పోతుల గెడ్డను ఆనుకుని ఉన్న కాలనీలు, వీధుల్లోనూ... గెడ్డ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు సాగిస్తున్నారు. ఆర్టీసీ కాంప్లెక్సు సమీపంలోని వరదగెడ్డ ఇప్పటికే ఆక్రమణలకు గురైంది. పట్టణంలోని సాగునీటి కాలువలు పూర్తిగా కనుమరుగయ్యాయి.

అధికారుల అండదండలతోనే!
ఆక్రమణలపై అధికారులకు ఫిర్యాదులు వస్తున్నప్పటికీ చర్యలు మాత్రం శూన్యం. స్థానికంగా కొందరు వ్యక్తులు రెవెన్యూ సిబ్బంది అండదండలతోనే ఆక్రమణలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులు మాత్రం ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదని చెబుతున్నారు. రెవెన్యూ, నగర పంచాయతీ అధికారులు సమన్వయంతో పనిచేస్తే తప్ప ఈ ఆక్రమణల పర్వం ఆగదనేది స్థానికుల మాట.

ABOUT THE AUTHOR

...view details