ఒడిశాలో కురుస్తున్న వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఉదయం నుంచి క్రమేపి నీటి ప్రవాహం పెరుగుతోంది. హిరమండలం గొట్టా బ్యారేజీ నుంచి వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. రాత్రికి మరింత వరద నీరు పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనాకు వచ్చారు. నాగావళి నదిలో కూడా వరద పోటెత్తుతోంది. భామిని మండలంలోని వంశధార పరివాహక ప్రాంతాల్లో మంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యే కళావతితో కలిసి కలెక్టర్ నివాస్ పర్యటించారు. నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ నివాస్ సూచించారు.
పొన్నాడ వద్ద నాగావళి నదిలో చిక్కుకున్న14 మంది పశువుల కాపరులను అగ్నిమాపక సిబ్బంది రక్షించి.. ఒడ్డుకు తీసుకువచ్చారు. వరద ప్రవాహ నేపథ్యంలో పరీవాహక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.శ్రీకాకుళం జిల్లాలో4చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.