హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు
15:46 July 02
హైకోర్టులో అచ్చెన్న పిటిషన్
ఈఎస్‌ఐ కేసులో అరెస్టయి విజయవాడ జిల్లా జైలులో ఉన్న తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు హైకోర్టును ఆశ్రయించారు. తనను జైలు నుంచి ఆస్పత్రికి తరలించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అచ్చెన్న పిటిషన్‌ను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. దీనిని శుక్రవారం విచారించనుంది.
అచ్చెన్నాయుడిని బుధవారం సాయంత్రం జీజీహెచ్ నుంచి డిశ్ఛార్జి చేశారు. చక్రాల కుర్చీపై అంబులెన్సులో ఎక్కించి, నేరుగా విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఏసీబీ న్యాయస్థానం ఆదేశాల మేరకు జూన్ 13న మాజీమంత్రిని గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చేర్చారు. ఆయనకు గతంలో చేసిన శస్త్రచికిత్స గాయం తిరగబెట్టటంతో వైద్యులు మరో రెండు శస్త్రచికిత్సలు చేసిన విషయం తెలిసిందే. 'ఇప్పటికీ కడుపులో మంట, జలుబు, దగ్గుతో బాధపడుతున్నా. కొలనోస్కోపీ నివేదిక రాకుండానే డిశ్ఛార్జి చేస్తున్నారు. కొవిడ్ పరీక్ష చేయాలన్నా పట్టించుకోలేదు' అని ఆసుపత్రి పర్యవేక్షకుడికి అచ్చెన్న బుధవారం లేఖ రాసినట్లు తెదేపా వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి: 'జగన్ డైరెక్షన్లో అనిశా ఒత్తిడితోనే అచ్చెన్నాయుడు డిశ్చార్జ్'