YCP Ministers awareness meeting on MLC elections: రాష్ట్రంలో 9 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి.. ఐదు చోట్ల ఇప్పటికే వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవమవ్వగా.. మిగతా 4 చోట్ల పోలింగ్ జరగనుంది. తాజాగా ఉపాధ్యాయ, పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగియడంతో.. మార్చి 13న పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోకపోవడంతో.. ఉమ్మడి చిత్తూరు, శ్రీకాకుళంలో ఒక్కోచోట, పశ్చిమగోదావరిలో రెండుచోట్ల ఎన్నికలు జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని వైసీపీ శ్రేణులకు ఎమ్మెల్సీ ఎన్నికలపై అవగాహన కల్పించేందుకు.. మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలు ఆనందమయి ఫంక్షన్ హాల్‌లో వైసీపీ సర్వసభ్య పేరుతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వైసీపీ రిజినల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు సుదీర్ఘంగా చర్చలు జరిపి, పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఏప్రిల్ నెల తర్వాత విశాఖపట్నం రాజధాని అవుతున్న నేపథ్యంలో ఈ ఎన్నికలను ప్రతి ఒక్కరూ ఛాలెంజ్‌గా తీసుకోవాలని మంత్రులు పిలుపునిచ్చారు.
అనంతరం విద్యాశాఖ మంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తూ.. చట్టసభల్లో 50 శాతం సీట్లను సీఎం జగన్ మోహన్ రెడ్డి కేటాయిస్తే.. జిల్లాలోని మహిళా ప్రజాప్రతినిధులు.. ఎమ్మెల్సీ ఎన్నికలకు అవసరమైన సమావేశానికి హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నిర్ణయం మేరకు స్థానిక సంస్థల ఓట్లు నూటికి నూరు శాతం పడాల్సిందేనని మంత్రి బొత్స సత్యనారాయణ కుండబద్దలు కొట్టేలా వివరించారు. ఓటర్లందరూ డివిజన్ కేంద్రాలకు ఒక్కరోజు ముందే చేరాలని సూచించారు.