ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Damaged Roads in AP: రాళ్లు తేలి.. గుంతలు ఏర్పడి.. నిత్య నరకంగా ప్రయాణం - damaged roads in ap

Damaged Roads in AP: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో.. కులాలు చూడం, మతాలు చూడం, పార్టీలు చూడబోమంటూ ప్రతి సందర్భంలో చెప్పే సీఎం జగన్‌.. గ్రామీణ రోడ్ల విషయంలో మడమ తిప్పారు. టీడీపీ హయాంలో చేపట్టిన గ్రామీణ రహదారి పనులను అధికారంలోకి వచ్చిన వెంటనే ఆపేశారు. రోడ్లను పూర్తి చేస్తే గత ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే కారణంతో గ్రామీణ ప్రజలను కష్టాల పాలు చేస్తున్నారు. రాళ్లు తేలి గుంతలమయమైన రోడ్లలో.. గ్రామీణ ప్రజలు నిత్య నరకం అనుభవిస్తున్నారు.

Damaged roads in AP
ఏపీలో దెబ్బతిన్న రోడ్లు

By

Published : Jul 6, 2023, 4:35 PM IST

రహదారులపై నరకం చూస్తున్న ప్రజలు.. ఇంకా ఎన్నాళ్లిలా..?

Damaged Roads in AP: గత ప్రభుత్వ హయాంలో రహదారులను పూర్తిగా గాలికొదిలేశారు. అత్యంత ప్రాధాన్య క్రమంలో.. రోడ్డు పనులు పూర్తి చేయాలి. పనులు ప్రారంభించే ముందు పూర్తి చేసిన తర్వాత ఫోటోలు తీయించి నాడు-నేడులో పెట్టాలి. 2022 మే 13వ తేదీన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై సమీక్షలో సీఎం జగన్‌ ఇలా ఆదేశాలు ఇచ్చారు. కానీ.. వాస్తవంలో పరిస్థితి మాత్రం పూర్తి భిన్నం. గత ప్రభుత్వ హయాంలో రోడ్లను గాలికొదిలేశారన్న ముఖ్యమంత్రి జగన్‌ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మొదలెట్టిన అనేక రోడ్లను.. కక్షగట్టినట్లుగా అర్ధంతరంగా ఆపేశారు.

పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ విభాగంలో వివిధ పద్దుల కింద.. 2019 ఏప్రిల్ 1కి ముందు మంజూరు చేసి 3 వేల 118 కోట్ల 38 లక్షల రూపాయల అంచనా వ్యయంతో ప్రారంభించిన 7,282 పనులను వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిలిపివేసింది. వీటిలో గ్రామీణ రహదారులు, వంతెనలు, భవనాలు ఉన్నాయి. అప్పటికే సుమారు 648 కోట్ల 83 లక్షల విలువైన పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు.. మరో ఏడాదిన్నరలో పూర్తయ్యే దశలో వీటిని ఎక్కడి కక్కడే నిలిపివేశారు.

ఇందులో పంచాయతీ గ్రామీణ రహదారులుకు సంబంధించి 1,728 కోట్ల రూపాయల విలువైన 5 వేల 217 పనులు ఉన్నాయి. వీటితో పాటు.. రోడ్ల అభివృద్ధి నిధి కింద 335.87 కోట్ల రూపాయల అంచనాతో చేపట్టిన 709 పనులు, జాతీయ గ్రామీణాభివృద్ధి పథకం కింద 594.81 కోట్ల రూపాయల అంచనాతో మొదలెట్టిన 607 పనులు నిలిపివేశారు. గ్రామీణ రహదారుల నిర్వహణ కోసం 183.7 6 కోట్ల అంచనాతో చేపట్టిన 467 పనులు కూడా ఆపేశారు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల అధ్వాన రోడ్లపై లక్షలాది మంది గ్రామీణులు అష్టకష్టాలు పడుతున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో చూస్తే లావేరు మండలంలోని వెంకటాపురం కూడలి నుంచి.. లుకలాపుపేట, గోవిందపురం, ఇజ్జాడపాలెం, కొత్తకోట, ఆదపాక తదితర 20 గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి పనులు అర్ధంతరంగా ఆపేయడంతో.. నాలుగేళ్లుగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 7.78 కిలోమీటర్ల పొడవైన ఈ రోడ్డు మరమ్మతు పనుల్ని 2019లో కోటి 20 లక్షల రూపాయలతో ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వీటిని నిలిపివేసింది.

ప్రస్తుతం ఈ రోడ్డు రాళ్లు తేలి గుంతలమయంగా మారింది. వర్షమొస్తే గుంతల్లో నీరు నిలిచిపోయి రాకపోకలకు తీవ్రంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోడ్డు మరమ్మతుల కోసం కోటి 15 లక్షల రూపాయలతో మరోసారి ప్రతిపాదన పంపామని అధికారులు చెబుతున్నా కార్యాచరణలో మాత్రం కానరావడం లేదు.

రహదారుల అభివృద్ధిపై గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని.. తన ప్రసంగాల్లో తరుచూ చెప్పే ముఖ్యమంత్రి జగన్.. తెలుగుదేశం హయాంలో ప్రారంభమైన రోడ్ల పనులు నిలిపివేయడం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ కారణాలతో మౌలిక వసతులను అడ్డుకోవడం ఏంటన్న ఆవేదన ప్రజల్లో వ్యక్తమవుతోంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో కులాలు, మతాలు, రాజకీయాలు, పార్టీలు చూడడం లేదంటూ ప్రతి సందర్భంలో ప్రకటించే సీఎం జగన్ ఈ రహదారుల పనుల నిలిపివేతపై ఏం సమాధానం చెబుతారని పలువురు ప్రశ్నిస్తున్నారు.

రాష్ట్రంలో రహదారులపై తీవ్ర విమర్శలు వస్తుండటంతో.. అంచనా విలువలో 25 శాతం కంటే తక్కువ ఖర్చు చేసి నిలిపివేసిన..గ్రామీణ రహదారులను తారు, సిమెంట్ రోడ్లుగా అభివృద్ధి చేయాలని అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వాస్తవంగా రోడ్లకు సంబంధించి గుత్తేదారులతో కాంట్రాక్ట్ 6 నుంచి 9 నెలల వరకు అమలులో ఉంటుంది. గడువు ముగిశాక ఒప్పందం పునరుద్ధరించాలి. ఇందుకోసం ఇంజినీర్లు ప్రతిపాదించగా ప్రభుత్వం నుంచి స్పందన లేదు.

కొన్నిచోట్ల అధికార పార్టీ ఎమ్మెల్యేలు గుత్తేదారులపై ఒత్తిడి తెచ్చి పనులు చేయించినా బిల్లులు చెల్లించలేదు. రాళ్లు తేలి గుంతలమయమైన రోడ్లతో ప్రజలు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ రహదారి పనులను పూర్తి చేస్తే గత ప్రభుత్వానికి మంచి పేరొస్తుందన్న కారణంతోనే పనులు నిలిపివేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details