Co-operative workers strike: సహకార సంఘ ఉద్యోగుల పట్ల.. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిని నిరసిస్తూ.. శ్రీకాకుళం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఎదుట పీఏసీఎస్ ఉద్యోగులు.. సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పీఏసీఎస్‌లో 50 శాతం వాటాలను ప్రైవేట్ వ్యక్తులతో పాటు కంపెనీలకు ఇవ్వడాన్ని వీరంతా తప్పు పట్టారు. అలాగే రైతు భరోసా కేంద్రాలను పీఏసీఎస్‌లలో విలీనం చేస్తూ.. 1964 చట్టానికి చేసిన సవరణ రద్దు చేయాలని సహకార సంఘ ఉద్యోగులంతా డిమాండ్ చేశారు. జీవో నెంబరు 90 ప్రకారం వేతనాలను ఇతర బెనిఫిట్లను వెంటనే అమలు చేయాలన్న ఉద్యోగులు.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ గ్రాట్యుటీని చట్ట ప్రకారం అమలు పరచాలని డిమాండ్ చేశారు. జీవో నెంబరు 36లో పేర్కొన్న.. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా 62 సంవత్సరాలకు పదవీ విరమణ వయస్సు పెంపునకు ఆదేశాలు విడుదల చేయాలని కోరారు.
పీఏసీఎస్ ఉద్యోగులు ధర్నా.. సమస్యలు పరిష్కారం కాకుంటే చలో విజయవాడ 2019 నుంచిపీఆర్సీని ఇంత వరకు మేము నోచుకోలేదు.. ఇప్పుడు అది ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం.. అలానే కంప్యూటరీకరణ అయితే కాని బదిలీలు చేయరాదు.. అంతే కాకుండా ఇప్పటి వరకు ఉన్న ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని కోరుకుంటున్నాం.. అలానే 50 శాతం ప్రైవేట్ వ్యక్తుల్ని సహకార సంఘాల్లో పెట్టి నిర్వీర్యం చేయెద్దని మేము డిమాండ్ చేస్తున్నాం.- రంగనాథ్, పీఏసీఎస్ ఉద్యోగ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు
పీఏసీఎస్ ఉద్యోగులు అందరూ కూడా ముఖ్యంగా ఉద్యోగ భద్రత మీద వాళ్ల డిమాండ్లు అన్నీ ఇచ్చి ఉన్నారు. దీని మీద రాష్ట్ర స్థాయిలో కమిటీ కూడా వేశారు. ఆ కమిటీ కూడా తక్షణమే సానుకూలంగా స్పందించి వారిని న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.- రమేష్, పీఏసీఎస్ ఉద్యోగ సంఘం ప్రతినిధి
చలో విజయవాడ నిర్వహిస్తామని ప్రకటన..సహకార సంఘ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నెల్లూరు కోఆపరేటివ్ సహకార బ్యాంకు ఎదుట ఉద్యోగ సంఘాల ఐక్య వేదికఆందోళనచేపట్టింది. సహకార ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఐకాసా నేత రామానాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ అధికారం చేపట్టిన తర్వాత జీవో నెంబర్ 36ను విడుదల చేసినా.. అది అమలుకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 36 అమలుకు నోచుకోకపోవడంతో వేతన సవరణ జరగక ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. బ్యాంకు ఉద్యోగులతో సమానంగా తమకు డీఏ ఇవ్వాలని.. పదవి విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలని కోరారు. ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించకుంటే జులై 17న చలో విజయవాడ నిర్వహిస్తామని ప్రకటించారు.
జగన్ గారు వచ్చిన తరువాత 2019లో 36 జీవో అని ఒకటి ఇచ్చారు. కానీ అది జీవోకు మాత్రమే పరిమితమైంది.. కాని అమలుకు నోచుకోలేదు. దానిని అమలు చేయవలసిన అధికారులు దానిని తుంగలో తొక్కి కుంటిసాకులు చెప్తున్నారే తప్ప అమలుకి మాత్రం నోచుకోవడం లేదు. కాబట్టి ఇది త్వరగా అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేయడం కూడా జరిగింది. మా సమస్యలు పరిష్కరం కాకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి ఆందోళనలకు దిగడం జరుగుతుందని తెలియజేస్తున్నాం.- రామానాయుడు, సహకార సంఘ ఉద్యోగుల ఐకాస నేత