ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రక్తనిధి ఖాళీ..! - carona effect

కరోనా’ వైరస్‌ నేపథ్యంలో గత నెల రోజులుగా రక్తదాన శిబిరాలు నిర్వహించడం లేదు. ఫలితంగా.. ‘రక్తనిధి’ పూర్తిగా ఖాళీ అయ్యింది. ఆపదలో ఉన్న వారికి, అత్యవసర రోగులకు అవసరమైన రక్తం తక్షణం అందించేందుకు వీలు కాని పరిస్థితి ఏర్పడింది. గర్భిణులు, తలసేమియా, సికిల్‌సెల్‌సేమియా, ఎముకమజ్జ వ్యాధి బాధితులు, రక్తహీనతతో బాధపడుతున్న వారికి జిల్లా రక్తనిధి నుంచి సరఫరా నిలిచిపోయింది. ఇది అత్యంత క్లిష్ట పరిస్థితి అని రెడ్‌క్రాస్‌ రక్తనిధి నిర్వాహకులు పేర్కొంటున్నారు.

srikakulam district
రక్తనిధి ఖాళీ..!

By

Published : Apr 2, 2020, 3:26 PM IST

శ్రీకాకుళంలో జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం సమీపంలో ఉన్న రెడ్‌క్రాస్‌ రక్తనిధిలో 4 ఫ్రిజ్‌లు ఉన్నాయి. ఒక్కొక్క ఫ్రిజ్‌లో 250 యూనిట్ల రక్తం వంతున వెయ్యి యూనిట్ల రక్తం నిల్వ చేసే సామర్థ్యం ఉంది. అత్యవసరమైన రోగులకు అందించాల్సిన రక్తఫలికలు తయారు చేసే యూనిట్‌ కూడా ఉంది. అయితే.. రక్తదాతలు ముందుకు రాని ప్రస్తుత పరిస్థితుల్లో.. చాలా తక్కువగా ఓ గ్రూపు రక్తం మాత్రమే అందుబాటులో ఉంది. జిల్లాలో కొన్ని తీవ్ర వ్యాధులతో బాధపడుతున్న వారికి నెలకు 120 రక్తం యూనిట్లు జిల్లా కలెక్టర్‌ ఆదేశంపై ఉచితంగా అందిస్తున్నారు. ప్రస్తుతం వీరికి అవసరమైన రక్తం అందివ్వలేకపోతున్నారు. ప్రతి నెలా 300 నుంచి 400 మందికి అత్యవసర పరిస్థితిలో, శస్త్ర చికిత్సల నిమిత్తం అందించేవారు. వారికీ ఇచ్చేందుకు రక్తం లేదు. రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులకు అవసరమైన రక్తం ఎక్కించటానికి వీలుకాక క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటున్నారు.

జిల్లాలో నెలకు 3500 నుంచి నాలుగు వేల వరకు ప్రసవాలు జరుగుతుంటాయి. వీరిలో రక్తహీనతతో బాధపడుతున్న వారు రక్తనిధి కేంద్రానికి వస్తే నామమాత్రపు రుసుం తీసుకుని ఇచ్చేవారు. నేటి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. దాతలు ముందుకు వస్తేగానీ పరిస్థితి మెరుగుపడదని నిర్వాహకులు చెబుతున్నారు.

దాతలు ముందుకు వస్తే ఇంటికి వెళ్లి సేకరిస్తాం

"అత్యవసర రోగులు వచ్చినపుడు రక్తం లేదని చెప్పి పంపిస్తున్నాం.. ప్రస్తుతం కరోనా వైరస్‌ కారణంగా రక్తదాన శిబిరాలు నిర్వహించడానికి వీలుపడడం లేదు. జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ ఆదేశం మేరకు... రక్తదాతలు ముందుకు వస్తే వారి ఇంటికి, లేదా చెప్పిన ప్రాంతానికి మొబైల్‌ రక్తసేకరణ అంబులెన్స్‌ పంపించి సురక్షితంగా రక్తం సేకరించడానికి నిర్ణయించాం. రక్తనిధికే వచ్చి ఇస్తామంటే వారింటికి అంబులెన్స్‌ పంపించి మళ్లీ ఇంటికి పంపిస్తాం. దాతలు, యువత, స్వచ్ఛంద సంస్థలు స్పందించి ముందుకు రావాలి" అని రెడ్‌క్రాస్‌ స్టేట్‌ వైస్‌ఛైర్మన్‌ జగన్మోహనరావు పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి:

లాక్​డౌన్​ నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం

ABOUT THE AUTHOR

...view details