ప్రభుత్వం ప్రవేశపెట్టింది చేదోడు కాదని, జగన్ చేతివాటం పథకమని టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ముంత ఇచ్చి చెంబు లాక్కుంటున్నట్లు జగన్ తీరు ఉందని విమర్శించారు. బడుగులకు ఒళ్లంతా వాతలేసి వెన్నపూసిన చందమే చేదోడు పథకమని ఆయన ఆక్షేపించారు. నాయీ బ్రాహ్మణ, రజక, దర్జీల సంక్షేమం పేరుతో జగన్ మోహన్ రెడ్డి నిట్టనిలువునా ముంచేస్తున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు.
చేదోడు కాదు.. జగన్ చేతివాటం: అచ్చెన్నాయుడు - వైసీపీపై అచ్చెన్నాయుడు కామెంట్స్
వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టింది... చేదోడు కాదు జగన్ చేతివాటం పథకమని తెదేపా సీనియర్ నేత కింజరపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. అర్హులైన నాయీ బ్రహ్మణులు, రజకులు, దర్జీలందరికీ రూ. 10 వేలు ఆర్థిక సాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అర్హులు లక్షల్లో ఉంటే సాయం మాత్రం కొందరికే అందుతోందని ఆరోపించారు. బీసీ ఉపప్రణాళిక నిధులు దారి మళ్లిస్తున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు.
కింజరపు అచ్చెన్నాయుడు
నవ్యాంధ్రప్రదేశ్లో 5.50 లక్షల మంది నాయీ బ్రాహ్మణులు ఉంటే.. కేవలం 38 వేల మందికి రూ.10 వేల చొప్పున, 15 లక్షల మంది రజకులు ఉంటే కేవలం 82,347 మందికి మాత్రమే సాయం చేయడం ద్రోహం కాదా అని నిలదీశారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 లక్షల మంది దర్జీలు ఉంటే కేవలం 1,25,926 మందికి ఆర్థికసాయం ఇస్తున్నారని మండిపడ్డారు. బీసీ ఉపప్రణాళిక నుంచి 3,634 కోట్లు దారి మళ్లించారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.
ఇదీ చదవండి :ఎస్ఈసీ వ్యవహారం: మెుదటి నుంచి.. అసలేం జరిగింది..?