Clash between YSRCP and JanaSena Leaders: రాష్ట్రంలో మేము మంచి పనులు చేయం.. వేరే వాళ్లు కూడా చేయొద్దు.. ఇది వైఎస్సార్సీపీ నాయకుల వ్యవహార శైలి. రోజురోజుకు పెరిగిపోతున్న వైసీపీ శ్రేణుల అరాచకాలపై జనసేన నాయకులు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రకరకాల కారణాలతో రెచ్చగొడతూ విధ్వంసం సృష్టిస్తున్నారని మండిపడుతున్నారు. చివరికి గ్రామానికి మంచి చేయడానికి వచ్చిన యువకులను కూడా చేయనివ్వకపోవడం దురదృష్టకరమని వాపోతున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో వేసవి ప్రారంభంలోనే గ్రామాల్లో తాగునీటి కోసం ప్రజలు తల్లడిల్లుతున్నారు. గ్రామాల్లో ప్రజలు గుక్కెడు నీటి కోసం.. ఇబ్బందులు పడుతుంటే.. వారికి సాయం చేసేందుకు జనసేన పార్టీకి చెందిన పలువురు యువకులు సిద్ధమయ్యారు. కానీ ఈ విషయం అధికార వైఎస్సార్సీపీ నాయకులకు నచ్చలేదు. వాళ్లు మంచి చేయకపోగా.. సహాయం చేసేందుకు వచ్చిన వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో విధ్వంసం సృష్టించారు. అంతకుముందు అడ్డొచ్చిన జనసేన పార్టీ యువకులను అడ్డుకున్నారు.
అసలేం జరిగిందంటే.. శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలం ఇరగంపల్లిలో అధికార వైఎస్సార్సీపీకి చెందిన కొందరు నాయకులు.. బావిని పూడ్చి వేయటం వివాదానికి దారి తీసింది. ఈ ఘటన ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇరగంపల్లి గ్రామంలో జనసేన పార్టీకి చెందిన ఇద్దరు యువకులు.. గ్రామంలోని పురాతన బావిలో పూడిక తీశారు. ఇదివరకే రెండు బావులు పూడుకుపోవడంతో రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని బావిని అందుబాటులోకి తెచ్చారు.