ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"పోలీసుల నుంచి మహిళలకు రక్షణ కల్పించాలి".. ఎన్​డబ్ల్యూసీకి అనిత ఫిర్యాదు - kadiri incident

TDP ANITHA COMPLAINT TO NWC : రాష్ట్రంలో కొంతమంది పోలీసులు రెచ్చిపోతూ.. మహిళలని కూడా చూడకుండా దుర్భాషలాడుతూ, వారిపై దాడులకు పాల్పడుతున్నారని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. కదిరిలో మహిళలపై పోలీసుల దాడిని ఖండిస్తూ జాతీయ మహిళా కమిషన్​కు ఫిర్యాదు చేశారు.

ANITHA
ANITHA

By

Published : Feb 28, 2023, 10:36 AM IST

TDP ANITHA COMPLAINT TO NWC : సత్యసాయి జిల్లా కదిరిలో మహిళలపై పోలీసుల దాడిని ఖండిస్తూ జాతీయ మహిళా కమిషన్​కు తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో కొంతమంది పోలీసులు రెచ్చిపోతూ.. మహిళలని కూడా చూడకుండా దుర్భాషలాడుతూ, వారిపై దాడులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. కదిరిలో సర్కిల్​ ఇన్​స్పెక్టర్​ ​ మధు మహిళలపై దాడికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నెల 25న కదిరిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం వీధులు వెడల్పు చేస్తున్న పేరుతో రెవెన్యూ అధికారులు అక్కడున్న షాపులను ధ్వంసం చేశారని.. ఈ నేపథ్యంలో షాపు యజమానులు, మరి కొంతమంది నిరసన తెలియజేయగా సర్కిల్​ ఇన్​స్పెక్టర్​ మధు వారిని అసభ్యకరంగా దుర్భాషాలాడుతూ సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించారని మండిపడ్డారు.

దళిత వర్గానికి చెందిన సుధారాణి అనే మాజీ కౌన్సిలర్​ను అసభ్యకరంగా దూషించారని దుయ్యబట్టారు. వైఎస్సార్​సీపీకి చెందిన కొంత మంది గూండాలు రాళ్లు విసరడంతో అనేక మందికి గాయాలయ్యాయని ఆరోపించారు. ఇన్​స్పెక్టర్ చర్యలకు వ్యతిరేకంగా అదే రోజు సాయంత్రం కొంత మంది మహిళలు ఆయన ఇంటి ముందు శాంతియుతంగా నిరసన తెలిపారని.. ఆ సమయంలో మధు, ఆయన సిబ్బంది మహిళలపై లాఠీఛార్జీ చేసి దాడికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు.

మధు మీసాలు మెలేస్తూ.. తొడలు కొడుతూ మహిళలను అసభ్యకరంగా దూషించారని.. ఆడవారు వారు వంటింటికే పరిమితమవ్వాలి కానీ ..రోడ్ల పైకి రాకూడదంటూ తిట్టారని మండిపడ్డారు. పోలీసుల దాడిలో అనేక మంది మహిళలు గాయపడి ఆసుపత్రి పాలయ్యారని.. అక్కడ అంత గొడవ జరుగుతున్న కానీ మహిళా పోలీసులు ఎవరూ లేరని ఫిర్యాదులో పేర్కొన్నారు. గంగారత్నమ్మ, ప్రవీణ్ బాబి అనే మహిళలు తీవ్రంగా గాయపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా కమిషన్ ఈ ఘటనపై విచారణ చేసి ఇన్​స్పెక్టర్ మధుపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వీలైనంత త్వరగా చర్యలు తీసుకుని ఏపిలో మహిళలకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

అసలేం జరిగిందంటే:కదిరిలోని దేవళం బజారులో ఆక్రమణల తొలగింపు నేపథ్యంలో టీడీపీ మహిళా కౌన్సిలర్​ను అర్బన్​ సీఐ మధు అసభ్యకర పదజాలంతో దూషించి అవమానించారు. విషయం తెలుసుకున్న మహిళా నాయకులు సీఐ నివాసం ఎదుట నిరసన తెలిపేందుకు వెళ్లగా.. మహిళలను చూసిన మధు ఒక్కసారిగా రెచ్చిపోయారు. ఆడవారు అని కూడా చూడకుండా లాఠీకి పని చెప్పారు. వీధులు వెంబడి తరుముతూ దొరికిన వాళ్లను దొరికినట్లే కొట్టారు. మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు పర్వీన్ భాను కుమారుడిని లాక్కెళ్లి.. అతని సెల్​ఫోన్​ని పగులగొట్టారు. మా ఇంటికి వచ్చే అంత దమ్ముందా అంటూ వాహనం పైకెక్కి హెచ్చరించారు. ఒక్కొక్కరి అంతు చూస్తానంటూ బెదిరించారు. ఈ విషయాన్ని మహిళలు నియోజకవర్గ ఇంఛార్జి కందికుంట వెంకటప్రసాద్ దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ శ్రేణులతో పాటు కందికుంట ప్రసాద్​ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టి సీఐ మధుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే టీడీపీ నేతల నిరసనలను జీర్ణించుకోలేని సీఐ మధు.. అధికార పార్టీ నాయకులకు సమాచారం చేరవేశారు. వైఎస్సార్సీపీ నాయకులు పెద్దసంఖ్యలో వచ్చి ఆందోళన చేస్తున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలపైకి రాళ్లు, బాటిళ్లు విసిరారు. కర్రలతో దాడిచేయడంతో పదిహేనుమంది కార్యకర్తలు గాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details