TDP 'Chalo Puttaparthi' Protest Updates: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉమ్మడి అనంతపురం జిల్లా పుట్టపర్తిలో పర్యటన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేడు 'చలో పుట్టపర్తి'కి పిలుపునిచ్చింది. ఈ క్రమంలో చలో పుట్టపర్తికి బయలుదేరిన టీడీపీ నేతలను, రైతులను, విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని, పోలీస్ స్టేషన్లకు తరలించారు. దీంతో పోలీసుల తీరుపై ఆగ్రహించిన నేతలు, రైతులు నల్ల బెలూన్లతో సీఎం గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ.. నిరసన వ్యక్తం చేశారు.
Police Stopped TDP Leaders: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో మంగళవారం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా వైఎస్సార్ రైతు భరోసా కింద నిధులను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సీఎం జగన్..ఉమ్మడి జిల్లాలో పర్యటించడంపై రైతులు, టీడీపీ నేతలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం పర్యటనకు వ్యతిరేకంగా 'చలో పుట్టపర్తి'కి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో 'చలో పుట్టపర్తి' నిరసనకు బయలుదేరిన తెలుగుదేశం నేతలను, శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో రైతులను ఆదుకోలేని ఈ ప్రభుత్వమెందుకని నేతలు ప్రశ్నించారు. అన్నదాతలకు న్యాయం జరిగేవరకు తాము పోరాటం సాగిస్తామని తేల్చి చెప్పారు.
TDP Leaders Protest With Black Balloons: సీఎం జగన్ పర్యటనను నిరసిస్తూ.. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని ఎన్టీఆర్ కూడలి వద్ద టీడీపీ నాయకురాలు సవిత ఆధ్వర్యంలో సీఎం గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ.. నల్ల బెలూన్లు ఎగరవేసి నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను అక్రమంగా అరెస్టు చేయడం సరికాదంటూ.. టీడీపీ శ్రేణులు తీవ్రంగా ప్రతిఘటించారు.