LOKESH YUVAGALAM PADAYATRA : రాష్ట్రంలో యువత, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర నిర్విరామంగా కొనసాగుతోంది. 2023 జనవరి 27న ప్రారంభమైన ఈ పాదయాత్ర నేటికి 56వ రోజుకి చేరుకుంది. పాదయాత్రలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, చిన్నారులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అభిమానాన్ని చాటుకుంటున్నారు. పలుచోట్ల గజమాలలతో స్వాగతాలు పలుకుతున్నారు. అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు.. ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాటన్నింటినీ అధిగమించి పాదయాత్రను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. అలాగే పోలీసులు అడుగడుగునా ఆంక్షలు పెట్టినా వాటిని చిరునవ్వుతో స్వీకరించి నిర్విరామంగా లోకేశ్ తన జైత్రయాత్రను సాగిస్తున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో..లోకేశ్యువగళం పాదయాత్ర నేడు శ్రీ సత్యసాయి జిల్లాలో 56వ రోజుకు చేరుకుంది. జిల్లాలోని సీకే పల్లిలో నారా లోకేశ్‌కు ప్రజలు.. తెలుగుదేశం పార్డీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా లోకేశ్‌కు పులమాలలు, హారతులతో జనం నీరాజనాలు పలుకుతున్నారు. లోకేశ్‌ని చూసేందుకు.. మాట్లాడేందుకు మహిళలు, వృద్దులు, పెద్ద ఎత్తున సీకే పల్లి కూడలికి వచ్చారు. దారి పొడవునా లోకేశ్ ప్రజలతో మాట్లాడుతూ సమస్యలు తెలుసుకున్నారు. నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయి ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే పన్నుల భారం, నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తామని లోకేశ్ వారికి హామీ ఇచ్చారు. విద్యుత్ చార్జీలు పెరిగి బిల్లు కట్టలేకపోతున్నామని, పెన్షన్లు తొలగించారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
సాయంత్రం ఉప్పరవాండ్ల కొట్టాల వద్ద సత్యసాయి నీటి సరఫరా కార్మికులతో లోకేశ్ సమావేశం అవుతారు. ప్యాదిండి సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు హాజరు అవుతారు. అనంతరం ప్యాదిండి శివారులో ఏర్పాటు చేసిన విడిది కేంద్రానికి చేరుకుంటారు.