ముఖ్యమంత్రి జే టాక్స్, ప్రకాశం జిల్లా మంత్రి బాలినేని బి-టాక్స్ వసూలు చేస్తూ.. వేలకోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ కొండెపి ఎమ్మెల్యే డోలా బాల వీరంజనేయస్వామి చేసిన వ్యాఖ్యలపై వైకాపా శ్రేణులు భగ్గుమన్నారు. కొండెపి వైకాపా నాయకుడు అశోక్ బాబు ఆధ్వర్యంలో వీరాంజనేయ స్వామి ఇంటి ముట్టడికి యత్నించారు. ముందుగా టంగుటూరులో సమావేశమైన వైకాపా నేతలు.. ఎమ్మెల్యే స్వామి తీరుని తీవ్రంగా ఖండించారు. నిరాధారమైన ఆరోపణలు చేసిన డోలా బాల వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
క్షమాపణలు చెప్పే వరకు వదిలేది లేదన్న వైకాపా శ్రేణులు.. అక్కడి నుంచి వాహనాల్లో కొండెపి నియోజకవర్గంలోని నాయుడుపేటలోని వీరాంజనేయ స్వామి ఇంటికి బయలుదేరారు. మార్గం మధ్యంలో పోలీసులు అడ్డుకున్నా.. వారిని దాటుకుంటూ ముందుకెళ్లేందుకు యత్నించారు. అయితే.. టంగుటూరు టోల్ గేట్ వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాసేపు అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.