ప్రకాశం జిల్లా చీరాల, కనిగిరి, కొత్తపట్నం తదితర ప్రాంతాల్లో నేత పనులు ఎక్కువగా జరుగుతుండగా- ఈ పరిశ్రమను నమ్ముకుని సుమారు 17 వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఒక్క చీరాలలోనే ఆరువేల కుటుంబాలు ఉన్నాయి. ఇప్పటికీ చీరాల అంటే చీరలకు పెట్టింది పేరు. అనేక రకాల చీరలు ఇక్కడ తక్కువకే లభిస్తాయని నమ్ముతారు. ఆ క్రమంలోనే రాష్ట్రంతో పాటు రాష్ట్రేతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ కొనుగోళ్లకు వస్తుంటారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ ప్రాంతంలో నేతన్నల కష్టాలను లాక్‌డౌన్ రెట్టింపు చేసింది. ఎవరిని కదిపినా కన్నీళ్లే సమాధానమవుతున్నాయి. చైనా, ముంబయి, సూరత్ నుంచి దిగుమతి అయ్యే ముడి రావడం నిలిచిపోయింది. స్థానికంగా ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తోంది. గతంలో కిలో పట్టు నాణ్యతను బట్టి రూ.2,500 నుంచి రూ. నాలుగు వేలకు లభించగా- ఇప్పుడు అదే పట్టు రూ. ఆరు వేల నుంచి రూ. ఎనిమిది వేలు పలుకుతుండటంతో సుమారు సగం మంది మగ్గాలను పక్కన పెట్టారు. ముడి సరకు ఉన్నవారు.. ఆర్డర్లు తీసుకున్న వారు వ్యయ ప్రయాసలకు ఓర్ఛి. మగ్గానికి పని చెప్పినా.. వస్త్రాలకు సరైన ధర రాక కూలి సైతం గిట్టుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాక్‌డౌన్ పరిమాణాల నేపథ్యంలో ఇప్పుడు పూర్తిస్థాయిలో మగ్గాల చప్పుడు ఆగిపోయింది.
కోలుకోలేని దెబ్భ..