ప్రకాశం జిల్లాలో ఒంగోలు కలెక్టరేట్, మార్కాపురం, కందుకూరు రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో మీకోసం పేరుతో నిర్వహించిన కార్యక్రమాన్ని ప్రస్తుత ప్రభుత్వం స్పందన పేరుతో నిర్వహిస్తోంది. స్పందనలో ఇప్పటి వరకు మొత్తం 30,944 అర్జీలు వచ్చాయి. ఇందులో సాధారణమైనవి 11 వేలు ఉండగా గడువు తీరినా పరిష్కారం లభించనవి 1,555 ఉన్నాయి. ఇందులో పట్టాదారు పాసుపుస్తకాల కోసం 551, కుటుంబ ధ్రువపత్రాల కోసం 152, ఉపాధి చూపాలని 121, మరణ ధ్రువీకరణ పత్రాల కోసం 78, పొజిషన్ సర్టిఫికెట్ కోసం 67, ఆదాయ ధ్రువీకరణ కోసం 52, ఆక్రమణలు తొలగించాలని 35, సీపీడీసీఎల్ కింద 499 అర్జీలు ఉన్నాయి.
స్పందనలో వచ్చిన అర్జీలను 15 రోజుల్లో పరిష్కరించాలని గడువు విధించారు. అయితే క్షేత్రస్థాయిలో అవి గడువులోపు పరిష్కారం లభించడంలేదు. మండల అధికారులు అంకెల్లో మాత్రం సమస్యలను పరిష్కరించినట్లు చూపుతున్నారు. సమస్య పరిష్కారం కాక బాధితులు మళ్లీ మళ్లీ స్పందనకు వస్తున్నారు. అధిక సంఖ్యలో గడువు తీరిన అర్జీలు ఉండటంపై జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు హెచ్చరించినా ఫలితం ఉండటంలేదని, ఏళ్లుగా తమ సమస్యలు పరిష్కారం కావడంలేదని బాధితులు వాపోతున్నారు.