రాష్ట్ర టైలర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడికి ఘన సన్మానం రాష్ట్ర టైలర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన విక్కీ నాగేశ్వరరావును ప్రకాశం జిల్లా ఒంగోలులో దర్జీలు ఘనంగా సన్మానించారు. ఒంగోలు ఎంసీఏ హాలులో జరిగిన ఈ కార్యాక్రమానికి భారీ సంఖ్యలో నగర దర్జీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర టైలర్స్ నూతన అధ్యక్షుడు విక్కీ నాగేశ్వరరావు మాట్లాడుతూ,అధ్యక్షుడు పదవకి ఐదుగురు పోటీ పడగా అందులో తనను ఎన్నుకున్న దర్జీలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పర్యటించి దర్జీల ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. టైలర్స్ ఫెడరేషన్ ఏర్పాటు చేసి 100 కోట్ల నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఆరు నెలలు పని ఉంటే మరో ఆరు నెలలు పని ఉండటం లేదనీ, ప్రభుత్వం చొరవ తీసుకొని ప్రభుత్వ ఏకరూప దుస్తులు కుట్టే పనుల్లో రాష్ట్రంలోని దర్జీలకు ప్రాధాన్యత ఇవ్వాలని వారు కోరారు. కుట్టు పనులు కనుమరుగవ్వకుండా వృత్తి శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.