ప్రకాశం జిల్లా చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్... ఖరీదైన గ్రానైట్‌గా ప్రసిద్ధి చెందింది. రెండు దశాబ్దాల నుంచి అనేక పరిశ్రమలు, స్థానిక వ్యాపారులు... ప్రభుత్వం నుంచి ఈ గ్రానైట్ కొండలను లీజుకు తీసుకుని... దాదాపు 40 గ్రానైట్ క్వారీలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఉత్పత్తి అయిన రాళ్లను పాలిష్ చేసేందుకు... పాలిషింగ్ యూనిట్లు ఏర్పాటయ్యాయి. బల్లికురవ ప్రాంతంలోనూ గ్రానైట్ క్వారీలు ఉండటం వల్ల... 15 ఏళ్ల క్రితం గుళ్లాపల్లి వద్దఉన్న గ్రోత్ సెంటర్ వద్ద... భవన నిర్మాణ ముడిసరకు ఎస్.ఈ.జెడ్ ఏర్పాటు చేశారు. ఈ తరహా ఎస్.ఈ.జెడ్ దక్షిణ భారత్‌లో ఇదొక్కటే.
12 వరకూ అతిపెద్ద గ్రానైట్ యూనిట్లు ఉండటం వల్ల.. పదివేల మంది కార్మికులకు ఉపాధి లభించేది. చిన్న పరిమాణాల్లో పలకలు కోసే 90 యూనిట్లు ఉన్నాయి. కాలక్రమంలో క్వారీలకు అతి సమీపంలో చీమకుర్తి, మార్టూరు ప్రాంతాల్లోనే పాలిష్ యూనిట్లు ఏర్పడ్డాయి. క్వారీల్లో ఉత్పత్తి అవుతున్న ముడిసరుకు నేరుగా వీటికే వెళ్తోంది. దీని వల్ల... క్వారీల మీదే ఆధారపడి గ్రోత్ సెంటర్ వద్ద ఏర్పడిన పరిశ్రమలకు ముడిసరుకు సరఫరా తగ్గిపోయింది. దీనికితోడు రవాణా ఛార్జీల భారంతో ఎక్కువ ధరకు గ్రానైట్ పలకలు అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో నెలకు 4వేల కంటైనర్లతో పాలిషింగ్ పలకలు అమెరికా సహా అనేక దేశాలకు ఎగుమతయ్యేవి. ఇప్పుడు 7 వందల కంటైనర్లకు మించి వెళ్లట్లేదని యజమానులు ఆవేదన చెందుతున్నారు.