చీరాలలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల నిషేధం..అవగాహన ర్యాలీ
ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వాడకాన్ని నిషేధించాలని కోరుతూ ప్రకాశం జిల్లా చీరాలలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గురువారం నుంచి ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను నిషేధించనున్న ఈ నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ర్యాలీ చేపట్టారు.
పర్యావరణానికి ముప్పు తీసుకొచ్చే ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వాడకాన్ని నిషేధించాలని పిలుపునిస్తూ ప్రకాశం జిల్లా చీరాలలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, పురపాలక అధికారులు, పోలీసులు, విద్యార్థులు పాల్గొన్న ఈ ర్యాలీ... మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల నుంచి ప్రారంభమై ప్రధాన వీధుల గుండా సాగింది. ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చే అనర్థాలను వివరిస్తూ ర్యాలీలో నినాదాలు చేశారు. విద్యార్థులు... భరతమాత, మహాత్మాగాంధీ, ప్లాస్టిక్ భూతం తదితర వేషధారణలతో ఆకట్టుకున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్-2020లో భాగంగా గురువారం నుంచి చీరాలలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను నిషేధిస్తున్నామని, ముందస్తుగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు భారీ ర్యాలీ చేపట్టినట్లు మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి తెలిపారు.