ప్రకాశం జిల్లా పామూరులో ఈ కేవైసీ కోసం ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రజలు బారులు తీరారు. రోజుల తరబడి నిరీక్షిస్తే గానీ.. ఈ కేవైసీ నమోదు చేయించుకునేందుకు తమవంతు రావటం లేదని వాపోతున్నారు. పాఠశాలలకు వెళ్లవలసిన విద్యార్థులు తల్లిదండ్రులతో కలసి బ్యాంకుల వద్ద క్యూలైన్లో రోజులు తరబడి నిరీక్షిస్తున్నారు. వారం క్రితం పామూరులో కరోనా కేసులు ఎక్కువగా ఉండడం, మరణాలు సంభవిస్తున్న తీరుతో.. అధికారులు లాక్ డౌన్ విధించారు.
ప్రస్తుతం కరోనా కేసులు తగ్గడంతో కొవిడ్ నిబంధనలకు కొంతమేర సడలింపు ఇచ్చారు. కరోనా కేసులు ఎక్కువ అయ్యే కొద్దీ.. అధికారులు కరోనా ఆంక్షలు విధిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నప్పటికీ.. బ్యాంకు అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ఓ ప్రణాళికతో ఎక్కువ కౌంటర్లను ఏర్పాటు చేసి ఈ కేవైసీ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రజలు కోరుతున్నారు.