ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే ఎమ్.మహిధర్ రెడ్డి అధికారుల తీరుపై గళమెత్తారు. తాగునీటి సమస్యతో ప్రజలు అల్లాడుతుంటే జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ నెల వచ్చినా ఇప్పటివరకూ తాగునీటి సమస్యపై ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదని, తాగునీటి నిర్వహణపై గుత్తేదారులకు పనులు అప్పజెప్పడంలో జిల్లా పరిషత్తు అధికారులు బాధ్యతగా పనిచేయడంలేదని... అధికార పార్టి ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి ధ్వజమెత్తారు.
సోమవారం సాయంత్రం ఒంగోలు జడ్పీ కార్యాలయానికి వచ్చి, తన నియోజకవర్గంలో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులు చెల్లింపులో అధికారులు పక్షపాతం చూపిస్తున్నారని... తన నియోజకవర్గంలోనే ఎందుకిలా జరగుతుందంటూ జడ్పీ సిఈఓ కైలాస్ గిరేష్‌ను నిలదీశారు. అధికారులను కలవడానికి, కనీసం ఫోన్ చేద్దామని వచ్చినా... తీరకలేదని, వీడియో సమావేశాలు, సమీక్షా సమావేశాలు అంటూ తప్పించుకుంటున్నారని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.