Micro Artist Mahitha: ఎవరైనా పెన్సిల్‌తో అక్షరాలు రాస్తారు. కానీ ఈ యువతి పెన్సిల్ లెడ్‌పైనే అక్షరాలు రాస్తూ.. ఔరా.. అనిపిస్తోది. ఖాళీగా కూర్చోలేక ప్రారంభించిన పని ఇప్పుడు తనకు పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెడుతోంది. అందరిలాగా కాక ఏదో కొత్తది ప్రయత్నిస్తూ ఉంటే తప్పకుండా ఏదో ఒక రోజు అనుకున్న స్థాయికి చేరుకుంటాం అంటుంది ఈ యువతి. పెన్సిల్ లెడ్‌పై అక్షరాలు చెక్కుతున్న ఈ అమ్మాయి పేరు అన్నం మహిత. ఉమ్మడి ప్రకాశం జిల్లా పర్చూరు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన నర్సింహారావు, భ్రమరాంబల కుమార్తె. తండ్రి ఆటో డ్రైవర్, తల్లి గృహిణి. మహిత డిగ్రీ పూర్తవగానే దేశంలో లాక్‌డౌన్ వచ్చింది. ఆ సమయంలో ఖాళీగా ఉండకుండా సొంతగానే సూక్ష్మకళ నేర్చుకుంది. సరదాగా ప్రారంభమైన అలవాటు తనకు చాలా పేరు తెచ్చింది.
పెన్సిల్ లెడ్‌పై 700 సంస్కృత శ్లోకాలు: మొదట చిన్నచిన్నగా బియ్యం గింజలపై ప్రదర్శించిన కళను ఆధారంగా చేసుకుని పెన్సిల్ లెడ్‌పై అక్షరాలు చెక్కుతుంది. అందర్నీ తన కళతో ఆశ్చర్యచకితుల్ని చేస్తోంది మహిత. భగవద్గీత మొత్తాన్ని చదివి 700 సంస్కృత శ్లోకాలను పెన్సిల్ లెడ్‌పై చెక్కినట్టు చెప్తోంది. ఇలా చేయడం తనకు చాలా సంతోషాన్ని కలిగించిందని అంటుంది మహిత. ప్రజల కోసం పనిచేసిన గొప్పవారి జీవిత చరిత్రల్ని తన కళ ద్వారా ఆవిష్కరించడం ఇష్టమంటుంది ఈ యువతి. అందుకే తెలుగు రాష్ర్టాలకు సంబంధించిన మాజీ ముఖ్యమంత్రులతో పాటు ప్రస్తుత సీఎంల జీవితాలు తన సూక్ష్మకళలో ఆవిష్కరించినట్లు చెబుతోంది. త్వరలో మరింత మంది మేధావుల జీవితాల్ని పెన్సిల్ పై చెక్కనున్నట్లు మహిత తెలిపింది.
పెన్సిల్ పై మహిత చెక్కే అక్షరాలు అచ్చం ప్రింటింగ్ చేసేటప్పుడు వచ్చే అక్షరాల్లా ఉన్నాయి. అంత అందంగా చెక్కడానికి చాలా రోజుల కృషి కారణమంటుంది ఈ యువతి. తనకు ఉన్న ఈ ప్రతిభను గుర్తించి తల్లిదండ్రులు ప్రోత్సహించారంటుంది. వారి వల్లే తనకు గుర్తింపు లభించిందని చెబుతోంది మహిత. తమ అమ్మాయి భగవద్గీత మొత్తం శ్లోకాలు చెక్కినప్పుడు చాలా సంతోషం అనిపించిందని చెబుతున్నారు నర్సింహారావు. పిల్లల్లో ఉన్న ఆలోచనలను గుర్తించి వాటిని ప్రోత్సహించడం తల్లిదండ్రులుగా తమ బాధ్యత అని అంటున్నారు. పిల్లల ఆనందం కోసం ఎంత కష్టపడ్డా ఇష్టంగానే ఉంటుందంటున్నారు నర్సింగరావు.