ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పంచాయతీల్లో తాగునీటి పథకాల నిర్వహణ అస్తవ్యస్తం - drinking water schemes in ap

గ్రామ పంచాయతీలకు కేటాయించే ఆర్థిక సంఘం నిధులను విద్యుత్తు ఛార్జీల కింద ప్రభుత్వం మళ్లించడంతో సాధారణ నిధులతో రక్షిత తాగునీటి పథకాల నిర్వహణ అస్తవ్యస్తమవుతోంది. ఓవర్‌హెడ్‌ ట్యాంకులు నిత్యం శుభ్రం చేయడానికి, క్లోరినేషన్‌కు, ఫిల్టర్‌ బెడ్ల నిర్వహణకు, విద్యుత్తు ఛార్జీలకు ఒక్కో పథకానికి నెలకు రూ.40 వేలు నుంచి రూ.60 వేల వరకూ అవసరమవుతాయి. నిధుల కొరతతో వీటిని చేపట్టడం లేదు.

పంచాయతీల్లో తాగునీటి పథకాల నిర్వహణ అస్తవ్యస్తం
పంచాయతీల్లో తాగునీటి పథకాల నిర్వహణ అస్తవ్యస్తం

By

Published : Feb 13, 2022, 4:39 AM IST

గ్రామ పంచాయతీలకు కేటాయించే ఆర్థిక సంఘం నిధులను విద్యుత్తు ఛార్జీల కింద ప్రభుత్వం మళ్లించడంతో సాధారణ నిధులతో రక్షిత తాగునీటి పథకాల నిర్వహణ అస్తవ్యస్తమవుతోంది. ఓవర్‌హెడ్‌ ట్యాంకులు నిత్యం శుభ్రం చేయడానికి, క్లోరినేషన్‌కు, ఫిల్టర్‌ బెడ్ల నిర్వహణకు, విద్యుత్తు ఛార్జీలకు ఒక్కో పథకానికి నెలకు రూ.40 వేలు నుంచి రూ.60 వేల వరకూ అవసరమవుతాయి. నిధుల కొరతతో వీటిని చేపట్టడం లేదు. దీని వల్ల రక్షిత తాగునీటి సరఫరా జరగడం. కృష్ణా, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో చాలా చోట్ల పథకాల ద్వారా సరఫరా చేస్తున్న రంగు మారిన, కలుషితమైన నీటిని తాగునీటి అవసరాలకు ప్రజలు వినియోగించడం లేదు. ప్రైవేటు ఆర్వో ప్లాంట్లలో కొనుగోలు చేస్తున్నారు. విజయనగరం, శ్రీకాకుళం, నెల్లూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని పలు మారుమూల గ్రామాల్లో ప్రత్యామ్నాయం లేని కారణంగా పంచాయతీలు సరఫరా చేసే నీరే ప్రజలకు ఆ‘ధార’మవుతోంది. దీని వల్ల పలు సార్లు అస్వస్థతకు గురవుతున్నామని స్థానికులు పేర్కొంటున్నారు.

గ్రామాల్లో తాగునీటి సరఫరా పరంగా ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం పంచాయతీల్లో నిధుల కొరత ఉన్న చోట కొందరు సర్పంచిలు తమ సొంత నిధులు ఖర్చు చేస్తున్నారు. ఆలస్యంగానైనా నిధులొస్తాయన్న నమ్మకంతో వారు మోటార్లు పాడైనా, దెబ్బతిన్న పైపులైన్ల మరమ్మతులకు, క్లోరినేషన్‌ చేయిస్తున్నారు. అయితే... పంచాయతీ ఖాతాలను సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్‌ఎంఎస్‌)కు అనుసంధానించడంతో అప్‌లోడ్‌ చేసిన బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యమవుతోంది. ఇలాంటి బిల్లులు సీఎఫ్‌ఎంఎస్‌లో రూ.150 కోట్లకుపైగా పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. బిల్లుల్లో జాప్యంతో కొందరు సర్పంచులు.. ఇక తమ వల్ల కాదని చేతులెత్తేస్తున్నారు. తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రూ.2.5 లక్షల వరకు ఖర్చు చేసి అప్పులపాలయ్యామని కర్నూలు జిల్లాకి చెందిన ఒక సర్పంచి ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక సంఘం నిధులు నేరుగా గ్రామ పంచాయతీ బ్యాంకు ఖాతాల్లో జమయ్యేలా ఏర్పాట్లు చేసినా...ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా రాలేదని శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో సర్పంచి పేర్కొన్నారు. ఇటీవల వచ్చిన నిధులు విద్యుత్తు ఛార్జీలకు మళ్లించడంతో పంచాయతీ ఖాతాల్లో ప్రస్తుతం మిగులు నిధులు జీరోగా చూపిస్తోందని, మళ్లీ నిధులొస్తే తప్ప గ్రామాల్లో ఎలాంటి పనులు చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామని కృష్ణా జిల్లాకు చెందిన సర్పంచి ఒకరు పేర్కొంటున్నారు. 2021-22 సంవత్సరానికి సంబంధించిన 15వ ఆర్థిక సంఘం నుంచి తొలి విడత కింద విడుదలైన రూ.900 కోట్లకుపైగా నిధులను గ్రామ పంచాయతీలు చెల్లించాల్సిన విద్యుత్తు ఛార్జీల కింద ప్రభుత్వం సర్దుబాటు చేసింది. రెండో విడత మరో రూ.900 కోట్లు రావాల్సి ఉంది. కేంద్రం విడుదల చేసిన వెంటనే అవి నేరుగా గ్రామ పంచాయతీ బ్యాంకు ఖాతాలకు జమయ్యేలా ఏర్పాట్లు చేశామని అధికార వర్గాలు తెలిపాయి.

ఇదీ చదవండి:

సమతామూర్తి విగ్రహం.. ప్రపంచంలో ఎనిమిదో అద్భుతం: వెంకయ్య నాయుడు

ABOUT THE AUTHOR

...view details