Jagananna Bhu Raksha Program : జగనన్న భూ రక్ష కార్యక్రమం ప్రకాశం జిల్లాలో భూ భక్షక కార్యక్రమంగా తయారైంది. వందేళ్లలో దేశంలోనే తొలిసారి భూముల రీ-సర్వే అని ఘనంగా ప్రభుత్వం ప్రకటించింది. భూతగదాలు కట్టడి చేస్తామంటూ కొత్త కొలతలన్నారు. 'కార్స్' వంటి ఆధునిక పరిఙ్ఞానంతో కచ్చితత్వం పక్కా అనీ చెప్పారు. తీరా రీ-సర్వే దాదాపు పూర్తైన గ్రామాల్లో చూస్తే ఫలితం మాత్రం ప్రభుత్వం ప్రకటించుకున్నట్లు ఏకోశాన కనిపించట్లేదు. ఆధునిక సాంకేతిక పరిఙ్ఞానంతో ప్రకాశం జిల్లాలో 822 గ్రామాల్లో 24.90 లక్షల ఎకరాల్లో సర్వే నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందులో 27 గ్రామాల్లో రీ సర్వే పూర్తిచేసి రాళ్లుపాతే కార్యక్రమం చేపట్టారు. అయితే పైలట్ ప్రాజెక్టుగా అనేక మండలాల్లో తొలి విడత రీ సర్వే మరింత వివాదాన్ని పెంచే విధంగా ఉంది.
రీ సర్వే.. మనస్పర్థలు : సంతనూతల పాడు మండలం గురవారెడ్డిపాలెం తొలి విడత సర్వే నిర్వహించిన గ్రామాల్లో ఒకటి. ఇంతవరకూ ఎవరి హద్దులు ప్రకారం వారు హక్కు పొంది, రికార్డుల్లో విస్తీర్ణం నమోదు చేసుకొని అనుభవిస్తున్నామని, కానీ ఇప్పుడు రీ సర్వే తరువాత సరి హద్దులు మారిపోయి, రైతుల మధ్య గొడవలు, కోర్టు కేసులు వరకూ వెళ్ళే పరిస్థితి నెలకొంది. గ్రామంలో అంతా బంధువర్గం అయినా, ఈ సర్వే తరువాత ఒకరి మధ్య ఒకరికి మనస్పర్థలు ఏర్పడే పరిస్థితులు నెలకొన్నాయి.
బ్యాంకు రుణాల కోసం రైతుల ఇబ్బందులు : ఒకే సర్వే నెంబర్‌లో సబ్ డివిజన్లో పలువురు రైతులు ఉంటారు. సర్వే అనంతరం ఇచ్చిన పాస్ పుస్తకాల్లో సర్వే నెంబర్‌లో ఉన్న అందరి రైతులు పేర్లు అందరి పుస్తకాల్లో ఉంటున్నాయి. ఒక రైతు బ్యాంకు రుణాల కోసమో, భూమిని తాకట్టు పెట్టుకోవడం కోసమో, విక్రయించుకోవాలన్న ఒక పాస్ పుస్తకంలో ఉన్న మిగతా రైతుల సమ్మతి కూడా అవసరం అవుతుంది. లేదంటే తన భూమి ఇలాంటి అవసరాలకు వినియోగించుకునే పరిస్థితి ఉండదు. మిగతా రైతులు మధ్య ఏమైన భిన్నాభిప్రాయాలు ఉంటే, వారు అనుమతించకపోతే, తమ అవసరాలు తీర్చుకోలేని పరిస్థతి నెలకొందని రైతులు పేర్కొంటున్నారు.
ఇష్టం వచ్చినట్లు సర్ధుబాటు :ఒకే సర్వే నెంబర్‌లో ఉన్న విస్తీర్ణం రీ సర్వే తరువాత తగ్గినా, పెరిగినా ఆ సర్వే నెంబర్లలో ఉన్న రైతులందరికీ సమానంగా సర్దుబాటు చేయాలి. రైతులను కూర్చో బెట్టి, వారి మధ్య అవగాహన కుదర్చాలి. ఈ సర్ధుబాటు కూడా సర్వే అధికారులకు 5 సెంట్లకు మించి చేయకూడదు. కానీ అధికార బలం, సిఫార్సులు, రాజకీయ పలుకబడులు ఉంటే, తమకు నచ్చిన వారికి ఎక్కువ మొత్తంలో కలిపి, మిగిలిన వారికి తగ్గిస్తున్నారు. ఇలా 10, 20 సెంట్ల విస్తీర్ణాన్ని కూడా ఇష్టం వచ్చినట్లు సర్ధుబాటు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.