వేతనాలు పెంచాలని ఐఎల్టీడీ కార్మికుల సమ్మె
ప్రకాశం జిల్లా చీరాలలోని ఐఎల్టీడీ కంపెనీ కార్మికులు వేతనాలు పెంచాలని ఆందోళన చేశారు. గతేడాది జూలై 31వ తేదీ నుంచి వేతనం ఇవ్వాలని, లేకపోతే సమ్మెలోకి వెళతామని హెచ్చరించారు.
ప్రకాశం జిల్లా చీరాలలోని ఐఎల్టీడీ కంపెనీ కార్మికులు...తమ వేతనాలు పెంచాలని ఆందోళనకు దిగారు. కంపెనీ ప్రధాన ద్వారం ఎదుట యాజమాన్యం వైఖరి మారాలని నినాదాలు చేశారు. చీపుర్లతో చిమ్ముతూ కార్మికులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఐఎల్టీడీ కంపెనీలో మేనేజర్లకు లక్షలాది రూపాయలు వేతనాల రూపంలో చెల్లిస్తున్న యాజమాన్యం... కార్మికుల ఇబ్బందులను పట్టించుకోవటం లేదని వాపోయారు. ముప్ఫై ఏళ్లుగా తామంతా తక్కువ వేతనాలకు పనిచేస్తున్నామని... చర్చల పేరిట నూతన వేతన ఒప్పందాన్ని కూడా అమలుచేయకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. వెంటనే వేతన ఒప్పందం చేసి గతేడాది జూలై 31వ తేదీ నుంచి వేతనం ఇవ్వాలని, లేకపోతే ఆందోళనలు ఉధృతం చేసి సమ్మెలోకి వెళతామని యాజమాన్యాన్ని హెచ్చరించారు.