ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా బాధితులను బెంబేలెత్తిస్తున్న ఒంగోలు జీజీహెచ్

ఒంగోలులోని ప్రభుత్వ సమగ్ర వైద్యశాల సిబ్బంది తీరు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. విపత్కర పరిస్థితుల్లో కొందరు వైద్యులు ప్రాణాలకు తెగించి కరోనా బాధితులను కాపాడుతుంటే.. మరికొంత మంది వైద్యులు మాత్రం నిర్లక్ష్యానికి నిలువెత్తు రూపంలా మారారు. ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి.

ongole ggh
ongole ggh

By

Published : Jul 24, 2020, 11:37 AM IST

ప్రకాశం జిల్లాలో కొందరు వైద్యుల నిర్వాకం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. కరోనా బాధితుల విషయంలో వారి నిర్లక్ష్య ధోరణిని వరుస సంఘటనలు కళ్లకు కడుతున్నాయి. కరోనా సోకిన వారిని వైద్య సిబ్బంది చర్యలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా మార్కాపురం మండలం నాయుడుపల్లికి చెందిన ఓ వృద్ధురాలి అదృశ్యం కుటుంబ సభ్యులను తీవ్ర మనోవేదనకు గురిచేస్తోంది.

చెప్పకుండా పంపించేశారు

నాయుడుపల్లికి చెందిన ఆవులక్క (72) అనే వృద్ధురాలికి కరోనా సోకటంతో ఈనెల 9న చికిత్స కోసం ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. వినికిడి సమస్యతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న ఈమె నిరక్ష్యరాసులు. చికిత్స చేసి రెండు వారాల తరువాత పంపిస్తామని చెప్పటంతో ఆమెను కుటుంబ సభ్యులు అంబులెన్సులో పంపించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై కూడా వీరికి తగిన సమాచారం లేదు. ఆమెను తీసుకువెళ్లేందుకు ఒంగోలు జీజీహెచ్‌కు గురువారం సాయంత్రం కుటుంబ సభ్యులు వచ్చారు. వృద్ధురాలి గురించి జీజీహెచ్​ సిబ్బందిని వాకబు చేయగా... ఈ నెల 13నే డిశ్చార్జి చేశామని సమాధానం ఇచ్చారు. అయితే తమకు సమాచారం ఇవ్వకుండా ఎలా డిశ్ఛార్జి చేశారని వైద్యులను ఆమె కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. మార్కాపురం వెళ్లేంత అవగాహన ఆమెకు లేదని.. పైగా మార్కాపురానికి ఒంగోలు నుంచి బస్సులు కూడా వెళ్లటం లేదని అన్నారు. ఆమె ఏమైయిపోయిందో అర్థం కాక పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఇదేకాకుండా జీజీహెచ్​లో జరిగిన మరికొన్ని ఘటనలు వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి నిదర్శనాలుగా మారాయి.


చనిపోయినా సమాచారమివ్వలేదు

కురుచేడుకు చెందిన ఓ మహిళ విషయంలోనూ ఒంగోలు జీజీహెచ్ సిబ్బంది ఇదే నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించారు. కరోనాతో ఆమె మృతి చెందినప్పటికీ.. కుటుంబ సభ్యులకు కనీసం సమాచారం ఇవ్వలేదు. క్షేమంగా ఉందనే ఉద్దేశంతో పరామర్శకు వచ్చిన కుటుంబ సభ్యులు... మరణవార్త విని నిర్ఘాంతపోయారు.

ఇంజక్షన్​కు లక్ష..

జిల్లా పోలీసు కార్యాలయంలో పనిచేసే హెడ్‌ కానిస్టేబుల్‌ కుమార్తెకు స్వల్ప కరోనా పాజిటివ్‌ లక్షణాలు కనిపించాయి. దీంతో హోమ్‌ క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. అతని అల్లుడు బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. తనకు తెలిసిన ఓ వ్యక్తి వద్ద కరోనా చికిత్సకు వినియోగించే ఇంజెక్షన్లు ఉన్నాయని.. అతన్ని సంప్రదించాలని సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు ఓ వ్యక్తి సూచించారు. దీంతో విషయాన్ని మామ అయిన హెడ్‌ కానిస్టేబుల్‌ దృష్టికి అతను తీసుకొచ్చారు. సదరు ఆగంతుకుడిని ఫోన్‌లో సంప్రదించగా.. రూ.45 వేలు ధర చెప్పి జీజీహెచ్‌ వద్దకు రమ్మన్నాడు. హెడ్‌ కానిస్టేబుల్‌ అక్కడికి వెళ్లి మళ్లీ ఫోన్‌లో ఆగంతుకుడిని సంప్రదించారు. అతను ఇంజెక్షన్‌ ధర రూ.1.10 లక్షలుగా చెప్పాడు. ఇదంతా మోసపు వ్యవహారమని గుర్తించిన హెడ్‌ కానిస్టేబుల్‌ అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించడంతో ఆగంతుకుడు పారిపోయాడు. కాసేపటికి అక్కడికి చేరుకున్న పోలీసులు హెడ్‌ కానిస్టేబుల్‌ నుంచి వివరాలు సేకరించారు. జీజీహెచ్‌ ఆవరణలోని సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నారు. జీజీహెచ్​లో ఈ వ్యవహారం జరగటంతో వైద్య సిబ్బంది తీరుపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సదరు వ్యక్తి పట్టుబడితే కరోనా ఇంజెక్షన్‌ పేరిట సాగుతున్న చీకటి దందా బయటపడే అవకాశం ఉంది.

మొత్తానికి రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు సంఖ్యకు తగ్గట్టుగా వైద్య సిబ్బంది, యంత్రాంగం స్పందించడంలేదన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. సమన్వయ లోపంతో ప్రజలను ఇబ్బంది పాలు చేస్తున్నారని కొంతమంది ఆరోపిస్తున్నారు.

ఇదీ చదవండి

రికార్డ్​ స్థాయి విజృంభణ- కొత్తగా 49,310 కేసులు

ABOUT THE AUTHOR

...view details