ప్రకాశం జిల్లా చీమకుర్తిలో గెలాక్సీ గ్రానైట్, బల్లికురువలో స్టీల్ గ్రే గ్రానైట్ క్వారీలు పెద్ద ఎత్తున ఉన్నాయి. వీటిని ఆధారం చేసుకుని వందల సంఖ్యలో భారీ, మధ్య తరహా పాలిషింగ్ యూనిట్లు వెలిశాయి. ముడిసరకు దగ్గర నుంచి పాలిష్ పలకల వరకూ ఇక్కడినుంచే విదేశాలకు, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంటాయి. ఏడాదికి వందల కోట్ల రూపాయల వ్యాపారం సాగుతున్నా ప్రభుత్వానికి మాత్రం రాబడి రావడం లేదు. కొంతమంది వ్యాపారులు అధికారులతో కుమ్మక్కై అక్రమ రవాణా సాగిస్తున్నారు. ప్రభుత్వానికి అందాల్సిన రాయిల్టీకి గండిపడుతోంది.
కోట్లల్లో వ్యాపారం... ప్రభుత్వానికి పన్ను ఎగనామం - chimakurthy
కోట్ల రూపాయల విలువచేసే వ్యాపారం. రోజూ వందల సంఖ్యలో కంటైనర్లు, లారీల్లో సరకు తరలింపు. గమ్యం చేరేలోపు ఎన్నో అక్రమాలు... తప్పుడు లెక్కలతో ప్రభుత్వానికి లక్షలాది రూపాయల రాయిల్టీ ఎగనామం. ఇదీ ప్రకాశం జిల్లాలో గ్రానైట్ వ్యాపారుల చేస్తున్న మోసం.
ఒక బిల్లుపై ఎన్నో ట్రిప్పులు
ఇటీవల విజిలెన్స్ అధికారులు చేసిన సోదాల్లో భారీగా గ్రానైట్ అక్రమంగా రవాణా చేసినట్లు తేలింది. గనులు, వాణిజ్యపన్నులు, రవాణా శాఖలు దేనికవే చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో గ్రానైట్ ముడిసరుకు, పాలీష్ చేసిన పలకలు అక్రమంగా తరలిపోతున్నాయి. నకిలీ మైనింగ్ బిల్లులు పెట్టి కొందరు రవాణా చేస్తుంటే, మరికొందరు ఒకే మైనింగ్ బిల్లు మీద రెండు, మూడు ట్రిప్పులు సరుకును రవాణా చేస్తున్నారు. ఈ రవాణా వల్ల ఒక్కో కంటైనర్ ద్వారా రూ.3 లక్షలు, జీఎస్టీ ద్వారా మరో రెండున్నర లక్షల వరకూ ఎగ్గొడుతున్నారు.
క్రిమినల్ కేసులతోనే కట్టడి
మార్టూరు, చీమకుర్తి, మద్దిపాడు గ్రోత్ సెంటర్లలో మొత్తం 300కి పైగా నకిలీ సంస్థలున్నట్లు అధికారుల సోదాల్లో బయటపడింది. ఎప్పుడైనా విజిలెన్స్ అధికారులు సోదాలు చేస్తే కేవలం జరిమానాలు కట్టి బయటపడుతున్నారు. క్రిమినల్ కేసులు పెట్టి వాహనాలు సీజ్ చేస్తే తప్ప ఈ అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడే సూచనలు కనిపించడం లేదు. గనులు శాఖ, వాణిజ్య పన్నుల శాఖ పటిష్టమైన నిఘా ఏర్పాటు చేస్తే అక్రమాలను నిరోధించే అవకాశం ఉంది.