ప్రకాశం జిల్లా పర్చూరు ఆసుపత్రిలో మాస్క్, గ్లౌజ్‌లు లేకుండానే రోగులను పరీక్షిస్తున్న వైద్యులని చూసి రోగులు ఆందోళన పడుతున్నారు. పర్చూరు ఆసుపత్రికి నిండు గర్భిణి వచ్చింది. తొలి కాన్ఫు. అప్పటికప్పుడు శస్త్రచికిత్స చేసి బిడ్డను బయటకు తీయాల్సి వచ్చింది. ప్రసవం కష్టం కావటంతో శస్త్రచికిత్స చేసి బిడ్డను బయటకు తీశారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. శస్త్రచికిత్స సమయంలో అవసరమైన మాస్కులు, గ్లౌవ్‌లు లేకపోయాయి.
ఆసుపత్రిలోని వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బందిదీ ఇదే పరిస్థితి. ప్రస్తుత పరిస్థితుల్లో తగిన రక్షణ లేకుండానే ఈ తరహా సేవలు అందించడం ప్రమాదకరమైనా... మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో చేస్తున్నట్లు చెబుతున్నారు.
జిల్లాలోని ప్రభుత్వాసుపత్రులకు ప్రభుత్వమే వీటిని సరఫరా చేస్తుంది. కానీ, కొద్ది రోజులుగా సంబంధిత శాఖ ఈ విషయమై దృష్టి సారించలేదు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లోనూ చర్యలు తీసుకోకపోవటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రాణాలు ఫణంగా పెట్టి రోగులకు పరీక్షలు నిర్వహించాల్సి వస్తోందని కొందరు వైద్యులు, సిబ్బంది వాపోతున్నారు. అటు రోగులూ భయపడుతున్నారు. కొద్దిచోట్ల మినహా.. ఎక్కడా గ్లౌవ్‌లు, మాస్కులు లేకపోవడం గమనార్హం.
ఇదీ పరిస్థితి...
కరోనాపై సమరం చేస్తున్న తరుణంలో నిత్యం వైద్యులు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో కొన్ని కేసులు చూడని పరిస్థితి ఉన్నందున... చాలా మంది ప్రభుత్వ వైద్యశాలలనే ఆశ్రయిస్తున్నారు. దీంతో సర్కారు ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో వైద్యులు, సిబ్బందికి అవసరమైన మాస్క్‌లు, గ్లౌజ్‌లు, శానిటైజర్లు తదితరాలు అందుబాటులో లేకపోవడం సమస్యగా మారింది.