సామాన్యులపై పెను భారం మోపుతున్న అధిక ధరలకు నిరసనగా.. ప్రకాశం జిల్లా చీరాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ముక్కోణం పార్కు కూడలిలోని రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి చేపట్టిన ర్యాలీ.. ప్రధాన వీధుల మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు సాగింది. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి తహసీల్దార్ మొహమ్మద్ హుస్సేన్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.
కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంటి గ్యాస్, పెట్రోల్, డీజీల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జీ అలీం పేర్కొన్నారు. అసలే కరోనా కష్టాలతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజల నెత్తిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త సమస్యలు తెచ్చిపెట్టాయన్నారు. పెంచిన ఆస్తి పన్నులు, ధరలను వెంటనే తగ్గించకుంటే.. ఆందోళనలు ఉద్దృతం చేస్తామని హెచ్చరించారు.
చిలకలూరిపేటలో...
దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు నిరసిస్తూ.. గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో వినూత్న పద్ధతిలో ధర్నా చేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జీ శ్రీ రాధాకృష్ణ ఆధ్వర్యంలో చేపటిన నిరసనలో సైకిల్, రిక్షా ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాలో పీసీసీ ప్రధాన కార్యదర్శి చిలకా విజయ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అలగ్జాండర్, ఇతర నాయకులు పాల్గొన్నారు.
గుంటూరులో..
ఇంధన ధరలు నియంత్రించాలని కోరుతూ.. గుంటూరులో కాంగ్రెస్ పార్టీ నేతలు సైకిల్ ర్యాలీ చేపట్టారు. అయితే స్థానిక పార్టీ జిల్లా కార్యాలయం నుంచి చేపట్టిన సైకిల్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ నాయుకులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. నిరసనకారులను స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.