లాక్ డౌన్‌లో ప్రజలు మాస్కులు లేకుండా బయట తిరగకూడదన్నది పోలీసుల నిత్యం చేస్తున్న ప్రకటన. అందులో చీరాలలో కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 18న చీరాల రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో కొత్తపేట చెక్‌పోస్టు వద్ద జరిగిన సంఘటన తీవ్రవివాదం అయ్యింది.
అబ్రహం, కిరణ్‌కుమార్ అనే ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై వస్తుండగా చెక్‌పోస్టులో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు ఆపి, మాస్క్ స్క్‌లేవని నిలదీశారు. ఈ సందర్భంలో యువకులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ విషయాన్ని కానిస్టేబుళ్లు ఎస్సై విజయకుమార్ కు తెలియజేశారు. తర్వాత వారిద్దరినీ జీపులో ఎక్కించుకుని వెళ్లారు. అనంతరం కిరణ్‌కుమార్‌కు తీవ్రంగా గాయాలయ్యాయని, అపస్మారక స్థితిలో ఉన్నాడని కుటుంబ సభ్యులకు సమాచారం రావడంతో ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించగా, మంగళవారం రాత్రి కిరణ్ మరణించాడు.
జీపు నుంచి దూకడంతో గాయాలు : చీరాల డీఎస్పీ
పోలీసులు తీవ్రంగా కొట్టడం వల్లే కిరణ్‌కుమార్ మృతి చెందాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మాత్రం ఇద్దరూ మద్యం సేవించి ఉన్నారని, అబ్రహం బ్రీత్ ఎనాలిస్‌లో 121 పాయింట్లు రీడింగ్ వచ్చిందని, కిరణ్ కుమార్ బ్లడ్ సాంపిల్స్ కూడా తీస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. అదుపులో తీసుకుని జీపులో స్టేషన్ కు తరలిస్తుండగా, కిరణ్ కుమార్ భయంతో జీపు నుంచి దూకేశాడని.. దీంతో అతని తలకు బలమైన గాయమైందని పేర్కొన్నారు. అపస్మారక స్థితిలో ఉండగా చికిత్స కోసం గుంటూరు తరలించామని పోలీసుల చెబుతున్నారు.