ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుటుంబంలో కరోనా మిగిల్చిన శోకం.. పిల్లల భవిత ప్రశ్నార్థకం!

నాలుగేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో తల్లి చనిపోయింది. తండ్రే తన కుమారుడు, కూతురిని కంటిరెప్పలా చూసుకుంటూ చదివిస్తున్నాడు. ఇంతలో కరోనా వారి పాలిట శాపంలా మారింది. అన్నీ తానై కుటుంబాన్ని చూసుకుంటున్న పెద్దను కొవిడ్ బలికొంది. దీంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో బతుకుతోంది. యజమాని ఇంటిని ఖాళీ చేయాలని చెప్పారని.. తమ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదని మృతుడి కుమార్తె ఆవేదన చెందుతోంది. ప్రభుత్వం వారిని ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

chilren become arpghaned parents died with corona in prkasham distrcit
కొవిడ్ వల్ల చౌటగోగులపల్లిలో అనాథలైన పిల్లలు

By

Published : Jul 3, 2021, 1:12 PM IST

కరోనా మిగిల్చిన శోకం .. వారి భవిత ప్రశ్నార్థకం!

కరోనా మహమ్మారి అనేకమంది జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. పిల్లలకు తల్లిదండ్రులను, పెద్దలకు పిల్లలను దూరం చేస్తోంది. ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు దూరమై.. బతుకు భారమై జీవనం కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటివరకు కుటుంబం బండిని నడిపిన ఇంటి పెద్ద..కరోనా కాటు బలి కావడం, కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులిద్దరూ మృతి చెందడంతో పిల్లల బతుకులు అగమ్యగోచరంగా మారాయి. దాతలు, ప్రభుత్వం సాయం చేయడానికి ముందుకు వస్తున్నా.. అది అందరికీ చేరడం లేదు.

కరోనా మహమ్మారి ఆ పిల్లలను అనాథలను చేసింది. ఆదుకునేవారు లేక బిక్కుబిక్కుమంటూ జీవనం సాగించాల్సి వస్తోంది. ప్రకాశం జిల్లా పెద్ద చెర్లోపల్లి మండలం చౌటగోగులపల్లి గ్రామంలో కుంభగిరి పోతులూరయ్య, స్రవంతి దంపతులకు సిద్ధార్థ్‌(10)(నాలుగో తరగతి), శ్రీనవ్య(16)(ఇంటర్‌ ఫస్టియర్​) పిల్లలున్నారు. 2017లో స్రవంతి రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. అప్పటినుంచి పిల్లలను పోతులూరయ్య కంటికి రెప్పలా చూసుకుంటూ చదివిస్తున్నాడు. పోతులూరయ్యకు కరోనా సోకగా కుమార్తె శ్రీనవ్య తండ్రిని వైద్యశాలలకు తీసుకెళ్లింది. ఒంగోలులోని రిమ్స్‌ ఆసుపత్రిలో 20 రోజులపాటు చికిత్స పొందుతూ మే 20న ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో శ్రీనవ్యతో పాటు అరవయ్యేళ్ల వయసున్న ఆమె అమ్మమ్మకు సైతం వైరస్‌ సోకగా కోలుకున్నారు.

ప్రస్తుతం వారు అద్దెకు ఉంటున్న ఇంటిని ఖాళీ చేయమని యజమాని ఒత్తిడి చేయడంతో ఇరవై రోజులపాటు గ్రామ పంచాయతీ కార్యాలయంలో తలదాచుకున్నారు. సర్పంచి, గ్రామ పెద్దల జోక్యంతో నెలరోజులు మాత్రం ఇంటిలో ఉండేందుకు యజమాని అవకాశమిచ్చారు. మరో పది రోజుల్లో ఖాళీ చేయాలని, ఆ తర్వాత తమ పరిస్థితి ఏమిటో తెలియడంలేదని ఆ పిల్లలు ఆవేదన చెందుతున్నారు.

స్థానికుల నుంచి కూడా తోడ్పాటు కరవైంది. ఇప్పటివరకు అధికారులు వచ్చి వెళ్తున్నారే తప్ప ప్రభుత్వం నుంచి ఎటువంటి పరిహారం అందడం లేదని పిల్లలు వాపోతున్నారు. దాతలు ఇచ్చే కొద్దిపాటి సాయంతో జీవనం కొనసాగిస్తున్నామంటున్నారు. తాము ఉండేందుకు ప్రభుత్వం ఏదైనా గూడు ఇవ్వాలని, చదువుకు సాయం చేయాలని శ్రీనవ్య కోరుతోంది.

ఇదీ చదవండి:ఏపీ పోలీసుల అదుపులో ఎనిమిది మంది బంగ్లాదేశీయులు

ABOUT THE AUTHOR

...view details