ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలోని అల్లూరు, బీరంగుంట, చింతల గ్రామాల పరిధిలో రైతులు సుమారు వెయ్యికి పైగా ఎకరాల్లో రొయ్యల చెరువులు సాగు చేస్తున్నారు. వీటికి పోతురాజు కాలువ నీరే ఆధారం. ఈ నీటితోనే సమీప గ్రామాల్లో వరితో పాటు గడ్డికయ్యలూ సాగు చేస్తున్నారు. సుమారు అయిదు నెలలుగా ఈ ప్రాంతంలో వరితో పాటు గడ్డికయ్యలు ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు కూడా కలుషితమవుతున్నాయి. చెరువుల్లోని రొయ్యలకు తరచూ వైరస్ సోకుతుండటంతో రైతులు భారీగా నష్టపోతున్నారు. ఎందుకిలా జరుగుతుందో తెలియక రైతులు తల పట్టుకుంటున్నారు.
చెరువులకు వినియోగిస్తున్న నీటిలో రసాయనాలు ఎక్కువగా కలుస్తుండటం కారణంగా చివరికి గుర్తించారు. రసాయనాలు ఎక్కడినుంచి ఎలా కలుస్తున్నాయనే విషయంపై రైతులు దృష్టి సారించారు. కొన్నిరోజులుగా నిఘా పెట్టారు.అర్ధరాత్రి సమయంలో రెండు ట్యాంకర్లలో రసాయన వ్యర్థాలను కొప్పోలు సమీపంలో పోతురాజు కాలువలో విడిచి పెడుతుండగా గుర్తించి పట్టుకున్నారు. ముగ్గురు డ్రైవర్లు, వాహనాలను ఒంగోలు తాలూకా పోలీసులకు అప్పగించి తమకు వాటిల్లుతున్న నష్టంపై ఫిర్యాదు చేశారు.