ఒంగోలు రెవెన్యూ డివిజన్లోని 14 మండలాల్లో 227 పంచాయతీలు, 2,324 వార్డులకు ఈ నెల 9న ఎన్నికలు జరగనుండగా ఇప్పటికే కొన్ని స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన చోట్ల పెద్ద సంఖ్యలో పంచాయతీలను దక్కించుకోవాలని అధికార వైకాపా ప్రణాళిక రచింది. అందులో భాగంగా ఇటీవల ఒంగోలులో జరిగిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జుల సమావేశంలో నాయకులకు మార్గదర్శనం చేశారు. అనంతరం 90 శాతం పంచాయతీలను కైవసం చేసుకుంటామని జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఈ విశ్వాసానికి భిన్నంగా కనిపిస్తున్నాయి.
తొలి దశ ఎన్నికల్లో 35 పంచాయతీలు ఏకగ్రీవం కాగా వాటిలో అధికార పార్టీ మద్దతుదారులవి 27. వాటిలోనూ కొందరు ఒప్పందం చేసుకున్నారు. ఎన్నికలు జరగనున్న మిగిలిన చోట్ల కూడా పరిస్థితులు అంత ఆశాజనకంగా లేవు. దాదాపు అన్ని స్థానాల్లో మద్దతుదారులు బరిలో ఉన్నప్పటికీ వంద చోట్లకుపైగా తిరుగుబాటు అభ్యర్థులూ ఉన్నారు. కొన్నిచోట్ల పరోక్షంగా తెదేపా మద్దతుదారులకు సహకరించడంలాంటి అంశాలు పార్టీ స్థానిక నాయకులకు మింగుడు పడటంలేదు. ఈ పరిణామాలతో పార్టీ అగ్రనాయకులు కూడా దృష్టిపెట్టి ఓటింగ్ అయినా ఎక్కువ పంచాయతీలను కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉండడం ఎన్నికలపై ఆసక్తిని రేపుతోంది.
ఆధిపత్యం, అంతర్గత పోరుతో అవకాశం
పర్చూరు నియోజకవర్గం పరిధిలో 95 పంచాయతీలకుగాను 15 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన వాటిల్లో దాదాపు 35 చోట్ల రెబల్స్ ఇద్దరు, ముగ్గురు చొప్పున అధికార పార్టీ మద్దతుదారులు బరిలో ఉన్నారు. అత్యధికంగా యద్దనపూడిలో ఐదుగురు, యనమదలలో నలుగురు, పూనూరులో ముగ్గురు, పర్చూరు మండలంలోని కొమర్నేనివారిపాలెంలో నలుగురు, గర్నెపూడిలో ముగ్గురు, మార్టూరు మండలం లక్కవరంలో ముగ్గురు చొప్పున ఉన్నారు. ఇంకొల్లు మండలంలోనూ తిరుగుబాటు అభ్యర్థులు బరిలో లేకపోలేదు.
సంతనూతలపాడు నియోజకవర్గంలో 30 చోట్ల తిరుగుబాటుదారులు బరిలో ఉన్నారు. అత్యధికంగా నాగులుప్పలపాడు మండలం హెచ్.నిడమానూరులో ఏడుగురు ఏ పార్టీకి చెందని మద్దతుదారులు, ఒక వైకాపా బలపర్చిన అభ్యర్థే బరిలో ఉన్నారు. తిమ్మసముద్రంలో నలుగురు స్వతంత్రులు ఉండగా ఇద్దరు వైకాపా మద్దతుదారులు ఉన్నారు. ఉప్పుగుండూరులో అధికారపార్టీకి చెందిన ఇరువర్గాల మద్దతుదారులు బరిలో ఉండగా... మూడో వ్యక్తి మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే సుధాకర్‌బాబు ప్రచారం నిర్వహించారు. చీమకుర్తి మండలం బండ్లమూడిలో నలుగురు, బూసరపల్లిలో ముగ్గురు వంతున రెబల్స్ ఉన్నారు.