మహానాడు అంటేనే తెలుగుదేశం పార్టీ ఘనంగా నిర్వహించుకునే పండుగ. పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి సామాన్య ప్రజల వరకూ ప్రతి ఒక్కరూ ఎదురుచూసే కార్యక్రమం. గతంలో జరిగిన విషయాల సమీక్షతో పాటు.. భవిష్యత్తు మార్గనిర్దేశం ఇదే వేదిక మీద జరుగుతుంది. మూడేళ్ల విరామం తర్వాత భారీస్థాయిలో నిర్వహిస్తున్న మహానాడుకు పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పోటెత్తారు. అనంతపురం నుంచి ఉత్తరాంధ్ర వరకు అభిమానులు తరలివచ్చారు. ఈసారి మహానాడును తొలిరోజు పార్టీ ప్రతినిధుల సమావేశంగానే నిర్వహించాలనుకున్నా...ప్రజలు భారీగా తరలి రావడంతో ఇది బహిరంగ సభగా మారిపోయింది.
ఎన్నికలకు మరో రెండేళ్లే ఉండటం, ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ప్రచారం జరగడంతో.. తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. ఇన్నాళ్లూ అధికార పార్టీ బెదిరింపులు, పోలీసుల నిర్బంధంతో తెదేపా కార్యకర్తలతో పాటు అభిమానులు, మద్దతుదారులు బయటకు వచ్చేందుకు జంకేవారు. ఇప్పటికీ నిర్బంధాలున్నా.. వారిలో తెగింపు వచ్చింది. జడత్వం వదిలింది. ఇటీవల పార్టీ కార్యక్రమమంటే నాయకుల కంటే వారే ముందుగా వస్తున్నారు. మహానాడుకూ అదే తెగింపుతో వచ్చారు. సభకు చిన్న రైతులు, రెక్కాడితే గానీ డొక్కాడని వారు, శ్రామికులు తరలివచ్చారు. తమపై నిర్బంధాలు కొనసాగుతున్నాయని... ప్రభుత్వ పథకాలు ఆపేస్తామన్న బెదిరింపులూ ఉన్నా సభకు వచ్చామన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తెదేపాను గెలిపించుకొంటామన్నారు.
మహానాడు తొలిరోజు అట్టహాసంగా, మహాత్సవంలా జరిగింది. గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో జనం తరలివచ్చారు. వేదికను జాతీయ రహదారి నుంచి 500 మీటర్ల దూరంలో ఏర్పాటు చేసినా.. ప్రాంగణం నుంచి జాతీయ రహదారి వరకు మధ్యలో ఎక్కడ చూసినా జనమే కనిపించారు. సభాప్రాంగణంలో ఏర్పాటు చేసిన కుర్చీలన్నీ నిండిపోయి... పెద్ద సంఖ్యలో జనం నిలబడి కార్యక్రమం తిలకించారు. పార్టీ జెండాలు, బ్యాడ్జీలను ఉత్సాహంగా కొంటూ కనిపించారు. చంద్రబాబు ప్రత్యేక భద్రతా సిబ్బంది, పోలీసులు, వాలంటీర్లు.. ఉత్సాహంగా దూసుకువస్తున్న కార్యకర్తల్ని నిలువరించలేకపోయారు. కార్యకర్తలు చంద్రబాబు ప్రత్యేక వాహనంపైకి ఎక్కేసి మరీ కార్యక్రమాన్ని చూసేందుకు ఉత్సాహం కనబరిచారు. వేదికకు రెండువైపులా కార్యకర్తలు గుమిగూడడంతో... నాయకులు వేదికపైకి వెళ్లేందుకు ఇబ్బందిపడ్డారు. చంద్రబాబు వేదికపైకి వచ్చినప్పుడు... అలాగే ఆయన ప్రసంగం ప్రారంభించినప్పుడు ప్రాంగణమంతా నినాదాలు, ఈలలతో హోరెత్తింది. పార్టీ ముఖ్య నాయకులు ఆవేశ పూరితంగా ప్రసంగించినప్పుడు... వైకాపా ప్రభుత్వంపై విమర్శలు చేసినప్పుడు పెద్ద ఎత్తున స్పందన కనిపించింది.