ఈ కాలంలోనూ...ఇలాంటి 'తెలుగు' పిల్లలున్నారు పరభాష మోజులో తల్లిదండ్రులూ పిల్లలకు మాతృభాషను అలవాటు చేయడంలేదనే విమర్శ ఉంది. ఆంగ్లం అనర్గళంగా మాట్లాడాలి బంగారం అంటూ తరచూ పిల్లలకు నూరిపోస్తుంటారు. ఆ మాయలో పడే తెలుగు విస్మరిస్తున్నారు. సర్వజ్ఞకు మాత్రం...తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మాతృభాషపై పట్టు సాధిస్తున్నాడు. రామాయణ, భాగవత కథలు వల్లిస్తున్నాడు. తెలుగు పద్యాలు అవలీలగా చెప్తూ భావాలు సైతం వివరిస్తున్నాడు.
మూడేళ్ల నుంచే...
ప్రకాశం జిల్లా దర్శికి చెందిన శివప్రసాద్ విద్యుత్తు శాఖలో ఇంజనీర్. అతడి భార్య శరత్ కౌమిది. వీరి సంతానమే సర్వజ్ఞ. ఓ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో నాల్గో తరగతి చదువుతున్నాడు. ఆంగ్ల భాషపై పట్టు సాధిస్తూనే, తీయనైన తెలుగుపై మక్కువ పెంచుకుంటున్నాడు. మూడేళ్ల వయసు నుంచే రామాయణ, భాగవత కథలు వింటూ, శతకపద్యాలు, వేమన పద్యాలు వంటివి నేర్చుకున్నాడు. మాచర్లలో తాతయ్య ఇంటికెళ్లినప్పుడు వారు చెప్పే కథలతో అలా తెలుగు, సంస్కృత పద్యాలు, శ్లోకాలపై ఆసక్తి పెరిగింది.
తెలుగు కథలు, దినపత్రికలు రోజూ చదవడం తల్లిదండ్రులు అలవాటు చేస్తున్నారు. చందస్సు నేర్చుకోవడం విశేషం.