YSRCP Negligence on Social Welfare Hostels: విద్యార్థుల మేనమామనంటూ చెప్పుకునే సీఎం జగన్.. వారి కోసం ఏర్పాటు చేసిన సాంఘిక సంక్షేమ హాస్టల్స్‌ని మాత్రం పట్టించుకోవడం లేదు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను.. అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా చేస్తానని గొప్పలు చెబుతుంటారు.. కానీ వారు ఉండటానికి సరైన వసతులు మాత్రం కల్పించడం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పెచ్చులూడిన భవనాల్లోనే విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ చదువుకుంటున్నారు. ఈ నాలుగేళ్లలో.. ఒక్కసారి కూడా మరమ్మతుల చేపట్టకపోవడంతో...నెల్లూరు జిల్లాలో సాంఘిక సంక్షేమ వసతి గృహాలు ప్రమాదకరంగా మారాయి.
మన రాష్ట్రంలోని నిరుపేద విద్యార్థుల వసతి గృహాలు పెచ్చులూడి.. శిథిలావస్థుకు చేరుకున్నాయి. పిల్లల్ని చదివించాలనే ఆశ ఉన్నా ఆర్థిక పరిస్థితుల వల్ల వెనుకంజ వేసే తల్లిదండ్రులకు భారం తగ్గించేందుకు ఈ సాంఘిక సంక్షేమ వసతి గృహాలు నెలకొల్పారు. పేదల పక్షపాతిని అని చెప్పుకునే జగన్ మాత్రం ఈ హాస్టల్స్‌ని గాలికొదిలేశారు. ఫలితంగా ఎటు చూసినా.. పెచ్చులూడిన పైకప్పు, పగుళ్లు వచ్చిన గోడలు, విరిగి పోయిన తలుపులు దర్శనిమిస్తున్నాయి.
"వర్షాలు కురిసినప్పుడు నీరు అంతా లోపలికి వస్తుంది. అప్పుడు మాకు చాలా ఇబ్బంది అవుతోంది. ఒక్కోసారి పెచ్చులూడి మీద పడుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. లగేజ్ పెట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాం. నిద్ర పోవడానికి కూడా అవస్థలు పడాల్సి వస్తోంది." -విద్యార్థులు