YSRCP Leaders Attacked on TDP Sympathizers: నెల్లూరు జిల్లా కావలి శివారు వెంగయ్యగారి పాలెంలో అధికార వైఎస్సార్సీపీ నేతలు రెచ్చిపోయారు. బెల్టు షాపుపై ప్రశ్నించిన టీడీపీ సానుభూతిపరుల కళ్లలో కారం చల్లి కత్తులు, రాడ్లతో దాడి చేశారు. సోమవారం గ్రామంలో సీతారాముల తిరునాళ్ల జరగ్గా.. కోడంబిళ్ల ఆట విషయంలో ఇద్దరు యువకులు మధ్య వివాదం జరిగింది. ఒక వర్గానికి చెందిన వ్యక్తులు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే.. పోలీసులు తీసుకోలేదు. పైగా గ్రామంలో బెల్ట్ దుకాణం పెట్టారని వైఎస్సార్సీపీ నాయకుల్ని అడిగినందుకు.. కళ్లల్లో కారం కొట్టి.. కత్తులు, రాడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో తెలుగుదేశం సానుభూతిపరులైన ప్రసాదు, వెంకయ్య, ముసలయ్య, సుజాత, అరుణలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తర్వాత నెల్లూరు వైద్యశాలకు తరలించారు. టీడీపీ నేత మాలేపాటి సుబ్బానాయుడు.. బాధితుల్ని పరామర్శించారు. గ్రామంలో, ఆసుపత్రి వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
"గ్రామంలో బెల్డ్ షాప్ పెట్టారని వైఎస్సార్సీపీ నాయకుల్ని అడిగినందుకు.. బయటి ఊరివాళ్లను తీసుకుని వచ్చి.. కళ్లల్లో కారం కొట్టి.. వారిపై దాడులకు తెగబడ్డారు. దీంతో పాటు కత్తులను, రాడ్లను, సుత్తులను తీసుకుని వచ్చి వారిపై అమానుషంగా దాడి చేశారు." - మాలేపాటి సుబ్బానాయుడు, టీడీపీ నేత