dumping yard kids : నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో దొంతాలి డంపింగ్ యార్డు వద్ద 20కుటుంబాలు నివసిస్తున్నాయి. వారితో పాటు వారి పిల్లలు సైతం డంపింగ్ యార్డులో లభించే పదార్థాలనే తింటూ దుర్గంధం మధ్య జీవనం గడుపుతున్నారు. ఆయా కుటుంబాలకు ఆధార్ కార్డులు లేకపోగా ప్రభుత్వం తరఫుల ఎలాంటి సాయమూ అందడం లేదు. వీరికి రేషన్ కార్డులే కాదు.. జనాభా లెక్కల్లోనూ పేరు లేదు. ఆయా కుటుంబాల దీనస్థితిని గమనించిన ఓ స్వచ్ఛంద సంస్థ ఉపాధ్యాయురాలిని నియమించగా ఇప్పుడిప్పుడే అక్షర జ్ఙానం నేర్చుకుంటున్నారు.
పిల్లలకు మంచి చదువు అందించాలని. మంచి జీవితాన్ని అందించాలని ప్రతి తల్లితండ్రుల కోరిక. అందరిలా చదువుకోవాలని, ఆడుకోవాలని చిన్నారుల్లోనూ ఉంటుంది. కానీ, అవకాశాలు లేక వందల కుటుంబాల్లో పిల్లలు చదువులకు దూరం అవుతున్నారు. అందులోనూ కాగితాలు ఏరుకునే జీవించే కుటుంబాల పరిస్థితి దుర్భరంగా ఉంటుంది. ఇటువంటి వారిపై ప్రభుత్వ అధికారులు దృష్టిపెట్టడంలేదు. నెల్లూరు కార్పోరేషన్ పరిధిలోని దొంతాలి డంప్పింగ్ యార్డులో చిన్నారులను పలకరిస్తే... చదువుకోవాలనే ఆనందం వారిలో కనిపించింది.
కడుదయనీయం :ప్రతి పట్టణం, ప్రతి నగరంలో కాగితాలు, ప్లాస్టిక్ డబ్బాలు, కవర్లు వంటి వ్యర్థాలను ఏరుకుని అమ్ముకుంటూ జీవనం సాగించే కుటుంబాలను రోజూ మనం రోడ్డు మీద చూస్తూనే ఉంటాం. కానీ ఎవరూ వారి జీవన పరిస్థితి ఏమిటని పట్టించుకోరు. ప్రభుత్వం కూడా వీరి జీవితాలను మెరుగుపరచాలనే ప్రయత్నం చేయడంలేదు. అందుకు సాక్ష్యమే నెల్లూరు నగరం శివారు ప్రాంతంలోని దొంతాలి వద్ద డంప్పింగ్ యార్డులో ఉన్న పరిస్థితి. 1205కుటుంబాల వారు కడుదయనీయంగా జీవనం సాగిస్తున్నారు.
చిన్నారుల కోసం చెట్ల కింద పాఠశాల :ఈ కుటుంబాల్లోని ముక్కుపచ్చలారని చిన్నారులు కూడా తల్లిదండ్రులు చూపిన దారిలోనే నడుస్తున్నారు. ఆ పిల్లలను చూస్తే సరైన ఆహారం లేక అర్థాకలితో బక్కచిక్కి అనారోగ్యంతో కనిపిస్తున్నారు. వీరి జీవితాల్లో వెలుగులు నింపాలని నవజీవన స్వచ్ఛంద సంస్థ చిరుప్రయత్నం చేసింది. డంపింగ్ యార్డులో వ్యర్ధాలను ఏరుకునే చిన్నారుల కోసం చెట్ల కింద పాఠశాలను ఏర్పాటు చేసింది. ఓ ఉపాధ్యాయురాలు సేవా భావంతో రెండు కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి అక్షరాలు నేర్పిస్తున్నారు.