ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పనుల కనికట్టు..అవినీతి గుట్టురట్టు

పనులు చేయకుండానే చేసినట్టు కాగితాలు సృష్టించి రూ.లక్షలు స్వాహా చేశారు అక్కడి అధికారులు.నెల్లూరు జిల్లా బ్రాహ్మణక్రాక పంచాయతీలో ఆరు నెలల్లోనే రూ.35 లక్షలను కొట్టేశారు. నిధుల దుర్వినియోగంపై ‘ క్షేత్రస్థాయిలో ఉన్నతాధికారులు విచారిస్తే మరిన్ని అక్రమాలు వెలుగులోకి రానున్నాయి..జలదంకి మండలంలోని పలు గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలనలో చోటుచేసుకున్న నిధుల దుర్వినియోగంపై ‘ఈటీవీ భారత్ కథనం

village secretaries  Fraud    at brahmanakraka
బ్రాహ్మణక్రాక పంచాయతీ కార్యదర్శుల మోసం

By

Published : Sep 7, 2020, 12:16 PM IST

తిమ్మినిబమ్మిని చేశారు. కొత్తగా రోడ్లు వేసినట్లు, పైపులైన్లు విస్తరించినట్లు.. నీటి సరఫరాకు కొత్త మోటార్లు కొనుగోలు చేసినట్లు మాయాజాలం చేసి ఎంబుక్కులు సృష్టించి రూ.లక్షలు బొక్కేశారు. గ్రామాల్లో సర్పంచుల పదవీ కాలం ముగియడంతో వాటి బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించారు. ఈ క్రమంలో కొందరు అధికారులు చక్రం తిప్పారు. ఒకే వ్యక్తికి ఏడు పంచాయతీల బాధ్యతలు అప్పగించి నిధుల స్వాహాపర్వం కానిచ్చారు.

రెండేళ్ల కిందట పంచాయతీల్లో ప్రజాప్రతినిధుల పాలన ముగియడంతో కార్యదర్శులు కీలకంగా మారారు. ఒకటి, రెండు పంచాయతీల బాధ్యతలను ఒక్కో కార్యదర్శి నిర్వర్తించారు. అదే సమయంలో ఒక కార్యదర్శి ఏడు పంచాయతీలకు ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు. మేజర్‌ పంచాయతీలైన బ్రాహ్మణక్రాక, జలదంకి, గట్టుపల్లి, ఎల్‌.ఆర్‌.అగ్రహారం, జమ్మలపాలెం పంచాయతీలతో పాటు రామవరప్పాడు, గోపనపాలెం గ్రామాలకు ఒక కార్యదర్శిని మండల అధికారులు నియమించడం అప్పట్లో విమర్శలకు తావిచ్చింది.

నీటి సరఫరా, పారిశుద్ధ్యం పేరుతో దుర్వినియోగం

బ్రాహ్మణక్రాక గ్రామ పంచాయతీ ఇన్‌ఛార్జి కార్యదర్శిగా విధులు నిర్వహించిన ఆరు నెలల్లోనే రూ.35,03,710 నిధులు ఖర్చు చేసినట్లు, వాటిలో దాదాపు రూ.30 లక్షలు పూడికతీత, మోటార్ల కొనుగోలు, పైపులైను విస్తరణ, బోర్లు, సైడు కాలువల ఏర్పాటుకు ఖర్చు చేసినట్లు దస్త్రాల్లో నమోదైంది. అదే పంచాయతీలోని హనుమకొండపాలెంలోని రెండు నీటి సరఫరా మోటారు మరమ్మతులకు రెండు నెలల్లో రూ.1.10 లక్షలు ఖర్చయినట్లు చూపారు. గ్రామంలో నీటి సరఫరా చేసే వర్కరు మాల్యాద్రిని ఈ విషయమై వారిని సంప్రదించగా... గ్రామంలో ఆరునెలల్లో రూ.10 వేలు మించి మోటార్ల మరమ్మతులకు ఖర్చు కాలేదని, పంచాయతీ నిధులు రూ.లక్ష దుర్వినియోగం జరగటం దారుణమన్నారు.

గట్టుపల్లి, జలదంకి, బ్రాహ్మణక్రాక, రామవరప్పాడు గ్రామాల్లో గతంలో బోర్లు వేసిన ప్రాంతాల్లోనే తిరిగి నూతనంగా కొత్త బోరు బావులు వేసినట్లు, పైపులైన్లు విస్తరించినట్లు, పాత మోటార్లు మొరాయించటంతో కొత్తవి కొనుగోలు చేసినట్లు నగదు పుస్తకాల్లో నమోదై ఉండటం, తిరిగి రెండు నెలలు కాక ముందే ఆ మోటార్లకు వేలాది రూపాయలతో మరమ్మతులు చేయించినట్లు ఖర్చులు చూపి రూ.లక్షలకు అక్రమంగా ఎంబుక్కులు రికార్డు చేసుకొని భారీ స్థాయిలో నగదు స్వాహా చేశారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

జలదంకి పంచాయతీలోనూ భారీగానే..

పంచాయతీలోని నాగిరెడ్డిపాలెంలో 2018 నవంబరులో కార్యదర్శి హయాంలో పైపులైన్ల విస్తరణకు, కొత్త మోటారు ఏర్పాటుకు రూ.71,510 ఎంబుక్కులు చేసుకొని నగదు డ్రా చేశారు. ఈ పనులను చూద్దామన్నా వాటి ఆనవాళ్లు కనిపించడం లేదు. అసలు ఆ పనులే జరగలేదని, నిధులు అక్రమంగా డ్రా చేశారని గ్రామ నీటి సరఫరా వర్కర్‌ మాలకొండారెడ్డి తెలిపారు. గ్రామంలో పైపులైను విస్తరణ పేరుతో 2018 నవంబరు, 2019 నవంబరులో భారీగా ఖర్చు చేసినట్లు ఎంబుక్కులు సృష్టించి రూ.లక్షలు డ్రా చేసి ఉండటం, తిరిగి అవే పనులకు ఎంబుక్కులు లేకుండానే సాధారణ నిధుల నుంచి రూ.లక్షలు చెల్లించి ఉండటం పలు విమర్శలకు తావిస్తోంది. గతంలో గ్రామంలో నిర్మించిన పలు సిమెంటు రోడ్లు, గ్రావెల్‌ రోడ్ల నిర్మాణాల పేరుతో జరిగిన నగదు దుర్వినియోగం పంచాయతీ నగదు పుస్తకాల ద్వారా వెలుగులోకి వచ్చింది. చేసిన పనులనే తిరిగి చేసినట్లు చూపటం, పేర్లు మార్చి రెండు సార్లు చూపిస్తూ నగదు డ్రా చేశారనేది తెలుస్తోంది. ఏడాదికి ఒకసారి జరిగే ఆడిట్‌లో అధికారులకు తాయిలాలు ఇచ్చి కార్యాలయాల్లోనే ఎంబుక్కులు చూపించి నామమాత్రంగా ఆడిట్‌ చేయించుకోవటంతో పలు అక్రమాలు వెలుగులోకి రావడం లేదు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి జలదంకి, బ్రాహ్మణక్రాక, గట్టుపల్లి, రామవరప్పాడు పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలనలో జరిగిన పనుల ఎంబుక్కులను గ్రామంలో క్షేత్రస్థాయిలో క్షుణ్నంగా పరిశీలించి బహిరంగ విచారణ చేసి పంచాయతీ నిధులు దుర్వినియోగం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

నిష్పక్షపాతంగా విచారణజరపాలి

రూ.లక్షల ప్రజా ధనాన్ని కొందరు అధికారులు దుర్వినియోగం చేయడం దారుణం. గ్రామ పంచాయతీ నిధులు కాపాడాల్సింది పోయి రోడ్లు వేయకుండానే వేసినట్లు, పనులు చేయకుండానే చేసినట్లు ఎంబుక్కులు సృష్టించి నగదు స్వాహా చేశారు. గ్రామ పంచాయతీల్లో ఆడిట్‌ జరిగిన పనులతో పాటు ఎంబుక్కులోని ప్రతి పనిని క్షేత్రస్థాయిలో నిష్పక్షపాతంగా విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.

-జి.వెంకటేశ్వర్లు, గ్రామస్థుడు, తొమ్మిదో మైలు

విచారించి చర్యలు తీసుకుంటాం

పంచాయతీ నిధుల దుర్వినియోగంపై ఉన్నతాధికారులతో క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహిస్తాం. ఆరోపణలు రుజువైతే బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటాం.

- ధనలక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారిణి

ఈ చిత్రం చూడండి.. బ్రాహ్మణక్రాక గ్రామ పంచాయతీలోని తొమ్మిదో మైలు ఎస్సీ కాలనీలో రామాలయం నుంచి కలిగిరి మెయిన్‌ రోడ్డు పేరుతో సిమెంటు రోడ్డు రెండేళ్ల కిందట నిర్మించారు. చేసిన పనులకు ఎంబుక్‌ నెం.843 ద్వారా ఉపాధి నిధులతో కలసి రూ 5,72,474 బిల్లు చేశారు. గ్రామ పంచాయతీ ఆర్థిక సంఘం నిధులు రూ.3,13,140, మిగతావి ఉపాధి నిధులను గుత్తేదారుకు గత సంవత్సరం సెప్టెంబరు 20వ తేదీన చెల్లించారు. సరిగ్గా ఆరు రోజుల తర్వాత ఇదే రోడ్డుకు పేరు మార్చి కృష్ణయ్య ఇంటి నుంచి నాగమ్మ ఇంటి వరకు సిమెంట్‌ రోడ్డు నిర్మించినట్లు ఎంబుక్‌ నెం.159 ద్వారా రికార్డు చేయించి గత సంవత్సరం సెప్టెంబరు 26వ తేదీన రూ.2,18,714 గ్రామ పంచాయతీ నిధులను అధికారులు డ్రా చేసి అక్రమాలకు పాల్పడ్డారు.

హనుమకొండపాళెంలో వాటర్‌ ప్లాంటు నుంచి చర్చి వరకు కూతవేటు దూరం ఉంటుంది. ఈ కాలువలో ఆరు గంటల పాటు పొక్లెయిన్‌తో పూడికతీత తీయించారు. వాస్తవానికి ఆరు గంటలు పొక్లెయిన్‌ పనిచేసినందుకు రూ.6 వేలు చెల్లించారు. కానీ రూ.1,11,526 చెల్లించినట్లు రికార్డుల్లో నమోదైంది. ప్రస్తుతం ఆ కాలువ పిచ్చిమొక్కలతో పూర్వస్థితిని సంతరించుకుంది. తమ కళ్ల ముందే గంటల పనిచేసి రూ.లక్షలు బొక్కేశారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

గ్రామంలో సైడు కాలువల పేరుతో పొక్లెయిన్‌తో పలు వీధుల్లో గ్రామ పెద్దల సమక్షంలో 20 గంటలకు రూ.20 వేలు ఖర్చు చేసిన పనులకు రూ.2 లక్షలకు పైగా పంచాయతీ నిధులతో ఎంబుక్కులు చేయించి నిధులు అధికారుల సన్నిహితుల ఖాతాలకు మళ్లించడం దారుణమని గ్రామస్థులు రామకృష్ణారెడ్డి, శివారెడ్డి తెలిపారు.

ఇదీ చూడండి.అంతర్వేది ఆలయ రథం కారణాల అన్వేషణలో కీలక శాఖల బృందం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details