నెల్లూరు జిల్లా చిన్న బజారుకు చెందిన తులసీ మధుసూదన్, లక్ష్మీకుమారి దంపతులది సాధారణ మధ్య తరగతి కుటుంబం. స్థానికంగానే చిన్న వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని నడిపేవారు మధుసూదన్. వీరి కుమార్తె అనూష చిన్నతనం నుంచే చదువులో చురుగ్గా ఉండేది. కుమార్తె చురుకుదనాన్ని చూసిన తల్లిదండ్రులు.. అదే రీతిలో ప్రోత్సహించారు. మొదటి తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివిన పాఠశాల, కళాశాలల్లో టాపర్‌గా నిలిచింది. ఆ తర్వాత ఎంసెట్‌లో రాష్ట్రస్థాయిలో 658వ ర్యాంకు సాధించింది. అనంతపురం జేఎన్టీయూలో ఈసీఈ బ్రాంచ్‌లో సీటు సాధించింది.
ఇంజినీరింగ్‌లోనూ మంచి ప్రతిభ కనబరుస్తూ అందరి ప్రశంసలు అందుకున్న అనూష.. ఈసీఈ బ్రాంచ్‌లో టాపర్‌గా నిలిచింది. బెస్ట్ అవుట్ గోయింగ్ విద్యార్థినిగా ఎంపికైంది. ఈ రెండింటికిగాను ఇటీవల జరిగిన వర్శిటీ స్నాతకోత్సవంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చేతుల మీదుగా రెండు బంగారు పతకాలు అందుకుంది. అంతేకాకుండా టెక్సాస్ యూనివర్శిటీ నిర్వహించిన ఇన్నోవేషన్ ఛాలెంజ్‌లో క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్లింది.